కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లాలో అధికార పార్టీ (Peddapalli Congress)లో పవర్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా పెద్దపల్లి లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య వర్గపోరు బహిర్గతమైంది. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
పెద్దపల్లి లోక్ సభ స్థానం పరిధిలోని మంథని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు గతంలో గడ్డం వివేక్‌తో శ్రీధర్ బాబుకు మధ్య తలెత్తిన విభేదాలే.. ఇప్పుడు వివేక్ కొడుకు ఎంపీ వంశీకృష్ణ హయాంలోనూ ప్రతిబింబిస్తున్నాయనే చర్చ బలంగా జరుగుతోంది. ఫలితంగా కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు, శ్రేణులు అయోమయంలో పడ్డాయి.
ప్రోటోకాల్ ఉల్లంఘనలు.. ప్రాధాన్యతలో శూన్యం
జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు, రివ్యూ మీటింగ్‌లు, ప్రారంభోత్సవాల్లో ఎంపీ వంశీకృష్ణకి తగిన గౌరవం దక్కడం లేదని అనుచరులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కలెక్టర్ సహా ఇతర సీనియర్ ఆఫీసర్లు కేవలం మంత్రి సూచనల మేరకే వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. రామగుండం ఎయిర్పోర్ట్ స్థల సేకరణపై ఎంపీ చొరవ తీసుకున్నా కానీ.. అధికారుల నుంచి ఆశించిన సహకారం అందడం లేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఎంపీని పార్టీ కార్యకర్తగా కూడా గుర్తించడం లేదంటూ సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టడంతో జిల్లా రాజకీయాల్లో వర్గపోరు తీవ్ర దుమారం రేపింది. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరు లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ ఒకే తాటిపై ఉంటూ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించారని శ్రీధర్ బాబు వర్గీయులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ప్రోటోకాల్ నిబంధనలకు లోబడే జరుగుతాయని, ఇందులో ఎవరినీ కావాలని పక్కనపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి, మంత్రికి కానీ ఉండదని స్పష్టం చేస్తున్నారు.
ఆధిపత్య పోరుకు కారణాలేంటి?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ కుటుంబాల మధ్య దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. గతంలో వివేక్, శ్రీధర్ బాబు మధ్య నడిచిన సుదీర్ఘ రాజకీయ ఆధిపత్య పోరే ఇప్పుడు ఎంపీ వంశీకృష్ణ హయాంలోనూ కొనసాగుతుందని అనుచరులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ భూసేకరణ, అభివృద్ధి పనుల క్రెడిట్ తో పాటు స్థానిక రాజకీయ వర్గపోరే ప్రధాన కారణమంటున్నారు.
జిల్లా అభివృద్ధి పనుల్లో మైలేజ్, నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే ఆధిపత్యానికి కారణమని పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఒకే వేదికపైకి వచ్చి గెలుపు కోసం శ్రమించిన నేతలు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వర్గాలుగా విడిపోవడం స్థానిక పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అధిష్టానం కల్పించుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదురుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

