మల్లన్న సాగర్ కట్ట కూల్చేందుకు కుట్ర.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఆరోపణలు

క‌లం, మెద‌క్ బ్యూరో: సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టను కూల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్​ఎస్​ నేత హరీశ్ రావు (Harish Rao) సంచలన అరోప‌ణ‌లు చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు నీటి అవసరాల కోసం ఎటువంటి అనుమతులు లేకుండా మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజర్వాయర్ కట్టకు అతి సమీపంలో అర్ధరాత్రి వేళ భారీ అక్రమ బ్లాస్టింగ్స్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తిప్పారం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హరీశ్​ రావు మల్లన్న సాగర్ కట్టను, పనులు జరుగుతున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, గతంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం వెనుక కూడా బ్లాస్టింగ్ జరిగిందనే అనుమానాలున్నాయని చెప్పారు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం 40 మీటర్ల ఎత్తు ఉన్న మల్లన్న సాగర్ కట్టకు 10 రెట్ల దూరంలో (400 మీటర్లు) ఎలాంటి నిర్మాణ లేదా పేలుడు పనులు చేయకూడదన్నారు. కానీ, కేవలం 150 మీటర్ల దూరంలోనే 16 నుండి 20 మీటర్ల లోతున జిలెటిన్ స్టిక్స్ ఉపయోగిస్తూ టన్నుల కొద్దీ రాళ్లను పేల్చివేస్తున్నారని ఆయన (Harish Rao) ఆరోపించారు.

అధికారులకు లేఖ రాసినా పట్టించుకోవడం లేదు:

ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భారీ పేలుళ్ల ధాటికి రిజర్వాయర్ కట్ట పక్కన రాళ్లు ఎగిరిపడటంతో పాటు సీపేజీ నీటి లీకేజి పెరిగి కట్టకు ప్రమాదం పొంచి ఉందని హ‌రీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పనులు నిలిపివేయాలని ఇరిగేషన్ అధికారులు హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWS&SB) అధికారులకు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే ఈ పనులు సాగుతున్నాయని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద తక్షణమే అక్రమ బ్లాస్టింగ్స్ నిలిపివేసి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై సమీక్ష నిర్వహించాలన్నారు.

నిపుణులైన ఇంజనీర్ల బృందంతో కట్ట భద్రతను క్షుణ్ణంగా తనిఖీ చేయించాలని హరీశ్​ రావు డిమాండ్​ చేశారు. ప్రాజెక్టు భ‌ద్ర‌త‌కు ముప్పువాటిల్లేగా ఏ అనుమతులు లేకుండా పనులు చేయిస్తున్న జలమండలి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జలవనరుల శాఖ మంత్రికి బహిరంగ లేఖ రాయనున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు. మల్లన్న సాగర్ కట్టకు ఎలాంటి విపత్తు వాటిల్లినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హ‌రీష్ రావు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>