కలం, యాదగిరిగుట్ట: బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు భువనగిరి పట్టణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫ్ (Judge Sheikh Arif) ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి షేక్ ఆరిఫ్ మాట్లాడుతూ.. పిల్లల మొబైల్ ఫోన్ వినియోగంపై తగిన పర్యవేక్షణ ఉండాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, బడికి వెళ్లాల్సిన వయస్సులో ఉన్న పిల్లలను పనుల్లో వినియోగించరాదని స్పష్టం చేశారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
ఉచిత న్యాయ సహాయం..
భువనగిరి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్‌ఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తుల పట్ల బాలబాలికలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి ఇబ్బందుల్లో పడవద్దని సూచించారు. న్యాయవాది ఎస్.సాయి శ్రీనివాస్ విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం పొందేందుకు ఉన్న అర్హతలు, న్యాయ సేవా సంస్థలు అందించే సేవలను వివరించారు ఉచిత న్యాయ సహాయం కోసం 15100 హెల్ప్‌లైన్‌ను, బాలల సంరక్షణకు సంబంధించిన సమస్యలపై 1098 ఛైల్డ్‌లైన్ సేవలను సంప్రదించవచ్చని అవగాహన కల్పించారు.
ఛైల్డ్‌లైన్ సిబ్బంది దశరథ మాట్లాడుతూ.. జిల్లాలో బాలల సంరక్షణ కోసం తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. బాల్య వివాహాల నివారణలో పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చట్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జడ్జి మెమెంటోలు అందజేశారు. పాఠశాల కమిటీ ఛైర్మన్ పి.జలందర్ రెడ్డి, కరస్పాండెంట్ పి. పురేందర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

