కలం, ఖమ్మం బ్యూరో: అధికార కాంగ్రెస్ కు మిత్రపక్షమైన సీపీఐ మధ్య రాష్ట్రస్థాయిలో సఖ్యత ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) చేసిన తాజా వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. “కాంగ్రెస్ నేతలు, కేడర్ పూర్తి సహకారం అందించకపోయినా, నేను మాత్రం అందరితో మంచిగానే ఉంటాను” అంటూ వ్యక్తం చేయడం వెనక అంతరార్థం ఏంటో తెలియడంలేదు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సీపీఐ మధ్య అంతర్గత ఆధిపత్య పోరును బయటపెట్టినట్టైంది.
సందర్భానుసారంగా ప్రస్తావిస్తూ..
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ, కొత్తగూడెం పరిధిలో కాంగ్రెస్ శ్రేణుల నుంచి తమకు తగిన సహకారం లేదనేది ఎమ్మెల్యే కూనంనేని ఆవేదనగా ఉంది. అయినా.. తాను రాజకీయ పరిపక్వతతో అందరితో కలిసిమెలిసి ఉంటున్నానని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో, అధికార కేడర్ తమను కలుపుకుని పోవడంలేదనే దానిపై బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పదవుల కేటాయింపు సమయంలో కాంగ్రెస్ నేతలు తమవారికే అన్నీ కావాలని పట్టుబట్టడంతోనే స్థానికంగా సమస్యలు వస్తున్నాయని కూనంనేని చెబుతూ బాధపడుతున్నారనేది బహిరంగమే.
ఆయన తప్ప అందరితో సాన్నిహిత్యమని..
ఇటీవల ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు, మంత్రులతో సమన్వయంపై కూనంనేని చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఇద్దరితోనూ, సీఎం రేవంత్ రెడ్డితోనూ తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందరితోనూ సమన్వయంతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యక్తం చేశారు. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, తనకు మధ్య గ్యాప్ ఉందని అంగీకరించడమే కాకుండా, కొత్తగూడెంపై మంత్రి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
కొత్తగూడెం రాజకీయాలపై పొంగులేటి చూపే ఆసక్తితోనే ఆధిపత్య పోరు పెరుగుతుందనేది కూనంనేని పరోక్ష ఉద్దేశంగా స్పష్టమవుతోంది. అంతేకాకుండా ప్రోటోకాల్ కూడా దక్కడం లేదనే కోణంలో కూనంనేని వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. అధికారిక వేదికలపై కూడా ఇవి బయటపడుతుండటం కూటమి ఐక్యతకు సవాల్‌గా మారుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల పొత్తుపై సస్పెన్స్
ఇలాంటి పరిణామాల నడుమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు కోసం సీపీఐతో కాంగ్రెస్ ఈనెల 23న చర్చలు జరిపింది. ఇందులో కూనంనేని పొత్తుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈనెలలో జరిగే కౌన్సిల్ భేటీ అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామని కూనంనేని తేల్చిచెప్పడం గమనార్హం. కాంగ్రెస్ స్థానిక నాయకత్వ తీరు, తమకు అందుతున్న సహకారంపై తీవ్ర అసహనంతో ఉన్న ఆయన, భవిష్యత్తులో పొత్తును కొనసాగించాలా వద్దా అనేదానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కూనంనేని తాజా వ్యాఖ్యలు అధికార పార్టీ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉందనేదానికి అద్దం పడుతున్నాయి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ మద్దతు కాంగ్రెస్‌కు దక్కుతుందా..! లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

