నగర పరిశుభ్రతపై కొలగాని శ్రీనివాస్ ఫోకస్

కలం, కరీంనగర్ బ్యూరో :  నగర పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని, సిబ్బంది, కార్మికులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున కరీంనగర్‌లోని 66వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ వంగల పవన్‌తో కలిసి టవర్ సర్కిల్ (Tower Circle) ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ పారిశుధ్య పనుల తీరును పరిశీలించి, పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముందుగా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణ, టవర్ సర్కిల్, పాత శివాలయం ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికుల బయోమెట్రిక్ హాజరు, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయం, అన్నపూర్ణ కాంప్లెక్స్, రాజీవ్ చౌక్, పాస్‌పోర్ట్ కార్యాలయం, శనివారం మార్కెట్, రైతు బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. చెత్త కుప్పలు పేరుకుపోకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నివాస గృహాలు, ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటోల ద్వారా నిర్ణీత సమయానికి ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలని అన్నారు. రోడ్లు, డ్రెయిన్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిని గుర్తించి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానాలు విధించాలని ఆదేశించారు. చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటో కార్మికులకు మాత్రమే అందించాలని ప్రజలకు సూచించారు.

పారిశుధ్య కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరుకావాలని, రాత్రి వేళల్లో ప్రధాన రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మురుగునీటి కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని, నగర పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ స్వామి, జవానులు నర్సయ్య, శ్రీనివాస్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>