కలం, వెబ్ డెస్క్ : శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు ఆలయ అధికారులు కీలక సమాచారం అందించారు. వేసవి సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో ప్రకటించారు.
సాధారణ భక్తులందరికీ కేవలం స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ముందుగానే ఆన్‌లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా యధావిధిగా దర్శన భాగ్యం కల్పిస్తారు. రద్దీని నియంత్రించి, సాధారణ భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ యంత్రాంగం తెలిపింది. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

