కలం, యాదగిరిగుట్ట : తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలంలోని వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను, అకాల వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులను మంత్రులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రామాజిపేట ఐకేపీ సెంటర్ గోదామును పరిశీలించి మీడియాతో మాట్లాడారు.
అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే వర్షానికి తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తక్షణమే బాయిల్డ్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుత రబీలో రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ఈ కొనుగోళ్ల ద్వారా రాష్ట్రంలోని 8.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని, ఇందుకుగాను రూ. 10,097 కోట్ల చెల్లింపులను కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని స్పష్టం చేశారు. రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం రవాణా వేగవంతం చేసేందుకు అవసరమైతే ఇసుక లారీలను కూడా ధాన్యం రవాణాకు మళ్లించాలని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు.
ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నయ్ : పొంగులేటి
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. ఈ ఏడాది ఊహించిన దానికంటే ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయ్యిందన్నారు. కొంత మంది యాత్రలు చేస్తున్నారని, వడ్లు అంటే కూడా తెలియని వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. మద్దతు ధర ప్రకటించిన ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తూ అత్యధిక మొత్తంలో డబ్బులు జమ చేశామన్నారు.
అనంతరం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రైతుల పక్షాన ప్రభుత్వం ఉందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అధికారులు పాల్గొన్నారు.

