పిల్లలకు బిస్కెట్లు ఇస్తున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

కలం, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఉదయం పూట పాలు లేదా టీ తాగేటప్పుడు బిస్కెట్లు ముంచుకొని తినడం ఒక అలవాటుగా మారిపోయింది. అంతేకాకుండా చిన్న పిల్లలు మారాం చేసినప్పుడు తల్లిదండ్రులు వారి చేతిలో బిస్కెట్లు (Biscuits for Kids) పెడుతుంటారు. పిల్లలు కూడా వాటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు.

కొంత మంది అయితే బిస్కెట్లను పిల్లలకు తరచూ స్నాక్స్ లాగా ఇస్తుంటారు. అయితే, ఇలా ప్రతిరోజూ బిస్కెట్లు తినడం వల్ల పిల్లల ఆరోగ్యానికి తీరని హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు బిస్కెట్లలో ఏం ఉంటుంది, వీటిని తినడం వలన పిల్లల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బిస్కెట్లలో ఏముంది..?

బిస్కెట్లను తయారు చేయడానికి మైదా, చక్కెర, ఉప్పు వంటి పదార్ధాలను వాడతారని మనందరికి తెలుసు. మైదాలో ఫైబర్ ఉండదు, ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది. బిస్కెట్లలో అధిక చక్కెర, మోతాదుకు మించి ఉప్పు ఉంటాయి. అంతే కాకుండా బిస్కెట్లు నిల్వ ఉండటం కోసం వాడే ప్రిజర్వేటివ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు లేదా ఖనిజాలు ఉండవు. కేవలం ‘కేలరీలు’ మాత్రమే ఉంటాయి.

పిల్లల టేస్ట్ బడ్స్ మాయం

బిస్కెట్లలో ఉండే కృత్రిమ రుచులు పిల్లల నాలుకపై ఉండే ‘టేస్ట్ బడ్స్’ సున్నితత్వాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల వారు ఇంట్లో వండే పప్పు, కూరలు, పండ్లు వంటి పౌష్​టికాహారాన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇది ప్రమాదకరమైన ఆహార వ్యసనం లాగా మారి, భవిష్యత్తులో వారి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పూర్తిగా దెబ్బతీస్తుంది.

బిస్కెట్లు తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు

పిల్లలకు ప్రతిరోజూ బిస్కెట్లు ఇవ్వడం వల్ల పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. బిస్కెట్లలో ఉండే అధిక క్యాలరీలు పిల్లలు వయస్సు కంటే ఎక్కువ బరువు పెరిగేలా చేస్తాయి. వీటిలో ఉండే చక్కెర వల్ల పిప్పిపళ్లు ఏర్పడి దంతాలు బలహీనపడే ప్రమాదం ఉంది. బిస్కెట్లు తిన్న వెంటనే శక్తి వచ్చినట్లు అనిపించినా, ఆ తర్వాత పిల్లలు త్వరగా అలసిపోయేలా చేస్తాయి. బిస్కెట్లలో ఉండే అధిక చక్కెర శాతం శరీరంలోని జీవక్రియను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ప్రతిరోజూ బిస్కెట్లు తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు నిపుణులు.

బిస్కెట్లకు ప్రత్యామ్నాయ పోషకాహారం

బిస్కెట్లకు బదులుగా పిల్లలకు రోజువారీ ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అలవాటు చేయాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆపిల్, అరటిపండు, దానిమ్మ వంటి పండ్లు ఇవ్వాలట. చక్కెర వేయకుండా తయారుచేసే మిల్స్ షేక్స్, ఫ్రూట్ జ్యూస్ వంటి పానీయాలు కూడా ఇవ్వొచ్చు. ప్రోటీన్, కాల్షియం కోసం పాల ఉత్పత్తులు అందించడం అవరసరమని చెబుతున్నారు. అంతేకాకుండా మెత్తగా ఉడికించిన కూరగాయలు, మిల్లెట్ బిస్కెట్లు ఇవ్వవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>