కలం, వెబ్ డెస్క్ : ఏపీలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు సంచలనం సృష్టించిన వేళ మరో లాకప్‌డెత్ తీవ్రం కలకలం రేపుతోంది. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న బొల్లి ఏడుకొండలు (50) అనే వ్యక్తి నెల్లూరు (Nellore Lockup Death) జిల్లాలోని మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే ఏడుకొండలు ప్రాణాలు కోల్పోయాడని మృతుడి బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు.
బంగారం గొలుసు చోరీ కేసుకు సంబంధించి చెరుకుముడి గ్రామానికి చెందిన ఏడుకొండలును పోలీసులు ఐదు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి అతడిని మనుబోలు పోలీస్ స్టేషన్లోనే ఉంచి తీవ్రంగా కొట్టారని.. పోలీసుల దాడి తట్టుకోలేక ఏడుకొండలు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. అతను గడ్డి మందు ( పురుగుల మందు) తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ఘటనలో అసలు నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారిక వివరాలు, పోస్టుమార్టం నివేదిక వెలువడాల్సి ఉంది. లాకప్‌డెత్ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

