బీఆర్ఎస్ జోరును తట్టుకోలేకే కుట్రలు : శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణలో రోజురోజుకు బీఆర్ఎస్‌కు(BRS) పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ తమపై కుట్రలు చేస్తోందని మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని (Mahabubnagar) బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డితో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనను పోలీసుల ద్వారా అడ్డుకోవడం, వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌పై కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకా కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని, రైతుబంధు అందించినందుకా, రైతులకు సాగునీరు కల్పించినందుకా, పెన్షన్లను పెంచినందుకా, వికలాంగులకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చినందుకా, ఇంటింటికీ తాగునీరు అందించినందుకా అని ప్రశ్నించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, ఆస్పత్రులను ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించినందుకా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినందుకా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అనంతరం మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు నల్ల టీషర్టులతో నిరసన తెలిపేందుకు వెళ్తే పోలీసులతో అడ్డుకోవడం, దాడులు చేయించడం ఇదేనా మీ నీతి, రీతి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై ప్రజల తరఫున ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ సంస్కారమా అని విమర్శించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలతో పాటు ప్రకటించని అనేక కార్యక్రమాలను కూడా అమలు చేసిందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.

కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి వస్తే తమ రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం పడుతుందనే భయంతోనే ఆయనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో పాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యా నాయక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, భూత్పూర్ మాజీ వైస్ చైర్మన్ బస్వరాజ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మహబూబ్‌నగర్ మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, బాలరాజు, గిరిధర్ రెడ్డి, జంబులయ్య, కట్ట రవికిషన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>