కలం, జగిత్యాల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి సర్కార్ ఆకతాయి వేషాలు వేస్తోందని జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి (Thatiparthi VijayaLaxmi) మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు తెలంగాణ ప్రజలే రాబోయే రోజుల్లో ‘చావుడప్పు’ కొడతారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్ర ముట్టడికి, ‘చావుడప్పు’ మోగించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌పై దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విజయలక్ష్మి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, ప్రతినిధులను పోలీసుల ద్వారా గృహ నిర్బంధం చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ శ్రేణులకు ఎస్కార్ట్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తూ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శ్రేణులను మాత్రం అరెస్టులు చేయడమేనా ప్రజా పాలన అంటే? అని ప్రశ్నించారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి కేసీఆర్ అని విజయలక్ష్మి కొనియాడారు. అలాంటి గొప్ప నాయకుడిపై ఇటువంటి నీచ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజాప్రతినిధులు, మహిళా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకే రక్షణ లేని పరిస్థితిని తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి పాలనను రాష్ట్ర ప్రజానీకం గమనిస్తుందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు.

