కలం, మహబూబ్నగర్ బ్యూరో: కృష్ణ బేసిన్ నీళ్లను కుప్పం దాకా తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించిన పాలకులు మన నీళ్లను మనకు ఇవ్వడానికే కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆరోపించారు. సోమవారం మహబూబ్నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా రైతాంగాన్ని కాపాడుకోవడానికి అందరు నడుంకట్టాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే వలసలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్, నారాయణ పేట, గద్వాల్ జిల్లాల నుంచి మకళ్లీ వలసలు ప్రారంభం అయ్యాయన్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఎకరాకు 25 వేల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. రైతు కూలీలను కూడా ఆదుకోవాలన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలన చేతకాక విచిత్రమైన ప్రకటన చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పంటలు వేసుకోవద్దు..నీళ్లు తాగొద్దు.. లైట్స్ వేయకండి.. అంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
35 లక్షలకి పైగా సారవంతమైన భూమి కలిగిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయంను బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పండుగ లెక్కన చేసిందని, ఆయన గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయితే 12 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు వచ్చేదని పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులు పూర్తికావడం లేదని ఆయన ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని, దానికి జాతీయ హోదా భాజపా ప్రభుత్వం కల్పించాలని, జూపల్లి కృష్ణ రావుతో పాటు బీజేపీ నాయకులు దీనిపై మాట్లాడాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. పది శాతం పాలమూరు ప్రాజెక్ట్ పనులు నిలిచాయి. వాటిని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఆరు నెలల్లో ఎస్ ఎల్ బి సి పూర్తి చేస్తామని చెప్పి కనీసం కనిపించకుండా పోయిన ఆరు శవాలు కూడా తీయలేదన్నారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్య నాయక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, బీ ఆర్ ఎస్ పార్టీ పట్టాన అధ్యక్షులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

