కలం, కరీంనగర్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గంగాధర పోలీస్ స్టేషన్ ఆవరణలో కొలువుదీరిన అమరవీరుడు, కానిస్టేబుల్ గుజ్జెటి మహేష్(Police Martyr Mahesh) విగ్రహానికి చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం (Medipalli Satyam), కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 2008లో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య జరిగిన బలిమెల దుర్ఘటనలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన మహేష్ సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు.అనంతరం అమరుడి కుటుంబ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థుల కోసం ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయుధాలు, పోలీస్ సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగం అత్యున్నత క్రమశిక్షణ, త్యాగనిరతితో కూడుకున్నదని అన్నారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి ఇన్స్పెక్టర్ ప్రదీప్, ఎస్ఐలు వంశీకృష్ణ, రాజ్ కుమార్, రాజులతో పాటు పోలీస్ సిబ్బంది, అమరుడి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

