కలం, స్పోర్ట్స్: ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఈసారి డబ్ల్యూపీఎల్ (డబ్లూపీఎల్) ట్రోఫీ ముద్దాడాలంటే ఆ ఒక్క కీలక ప్లేయర్ జట్టుకు అత్యంత అవసరమని భారత మాజీ క్రికెటర్ రీమా మల్హోత్రా (Reema Malhotra) అభిప్రాయపడ్డారు. వరుసగా మూడు సార్లు ఫైనల్లో విఫలమైన ఢిల్లీ, ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో మినీ వేలానికి సిద్ధమవుతోంది. ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఒక అనుభవజ్ఞురాలైన వికెట్ కీపర్ బ్యాటర్ తప్పనిసరిగా కావాలని రీమా స్పష్టం చేశారు. ఇప్పటికే తనియా భాటియా, లిజెల్ లీలని విడుదల చేయడంతో జట్టులో లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. యంగ్ ప్లేయర్ మమతా మడివాలా జట్టులో ఉన్నప్పటికీ, పెద్ద టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకుని విజయాన్నందించే అనుభవం ఆమెకు ఇంకా రాలేదని చెప్పారు.
స్టంప్స్ వెనుక ఉంటూ బౌలర్లను నడిపించే నాయకత్వ పటిమ ఉన్న కీపర్ ఉంటేనే ఢిల్లీ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. ఇక విదేశీ ఆటగాళ్ల విభాగం బలంగానే ఉన్నప్పటికీ, అలనా కింగ్, స్నేహ్ రాణా వెళ్లిన తర్వాత జట్టుకు మరో భారతీయ ఆల్‌రౌండర్ అవసరమని రీమా తెలిపారు. ఆస్ట్రేలియా ప్లేయర్ గ్రేస్ హ్యారిస్ కోసం కూడా ఢిల్లీ గట్టిగా ప్రయత్నించవచ్చని చెప్పారు. సరిగ్గా అనుభవం ఉన్న కీపర్, ఆల్‌రౌండర్‌ను దక్కించుకుంటేనే ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ నిరీక్షణకు తెరపడుతుందని రీమా విశ్లేషించారు.

