కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: రైతుల్లో భరోసా నింపేందుకు త్వరలో పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని రామ్ రెడ్డి గూడెం రైస్ మిల్లు వద్ద వడ్లు ఆరబోసుకుంటున్న రైతులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి పాదయాత్ర ప్రణాళిక విడుదల చేస్తామని తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రతి రైతును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసం గురించి వివరిస్తామన్నారు.
గిట్టుబాటు ధర చెల్లించండి
రైతులకు గిట్టు బాటు ధర ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులకు సకాలంలో యూరియా.. కరెంటు ఇవ్వాలని.. పెట్టుబడి సాయం సకాలంలో ఇవ్వాలని కోరారు. పండించిన పంట సకాలంలో కొనుగోలు చేయడంతో పాటు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు చనిపోతే రైతు భీమా ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్ చేశారు. ఈ అన్ని డిమాండ్లతో తాము పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, రైతుల సమస్యలు పట్టించుకోకుండా వేధిస్తున్న ప్రభుత్వం భారతం పడతామనీ ఆయన హెచ్చరించారు. ప్రజా సమస్యలు వదిలేసి సర్పంచ్, కార్పొరేటర్లు,నాయకులను కొనుగోలు చేయాలనీ చూస్తున్నారనీ ఆయన విమర్శించారు. రైతులు అధైర్య పడవద్దని.. ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా పోరాటం చేస్తాం మీకు అండగా మేముంటామని భరోసా కల్పించారు. బీఆర్ఎస్ వరంగల్ సభ పెడుతున్నట్టు ప్రకటన వచ్చిన వెంటనే పాత పద్దతిలో పంట కొనుగోళ్లు ప్రారంభించారనీ గుర్తు చేశారు.
కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతుల నుంచి మిల్లర్లు ఎక్కువ తరుగు తీస్తున్నారనీ ఆయన తెలిపారు. రెండు నుంచి మూడు కిలోలు తరుగు తీస్తున్నట్లు రైతులు చెబుతున్నారని ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందనీ, మూడు సార్లు రైతు బందు ఎగ్గొట్టారనీ, వ్యవసాయానికి కరెంటు సరిగ్గా ఇవ్వలేదనీ ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆంజనేయులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

