కలం, సారంగాపూర్: సారంగాపూర్ మండలం అడెల్లి (Adelli) గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ఆలయ (Pochamma Temple) తొలి వార్షికోత్సవ వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకలకు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవితమ్మ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మహా పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం నిర్వహిస్తున్న తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కౌట్ల (బి) గ్రామానికి చెందిన మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఈవో భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

