పకడ్బందీగా ఓటరు సవరణ.. నిజామాబాద్‌కు కితాబు

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ అమలులో (SIR Implementation) నిజామాబాద్ జిల్లా పనితీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు ప్రశంసించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో బీఎల్‌ఓల నుంచి ఈఆర్‌ఓల వరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించారని అభినందించారు.

జిల్లాలో ఎస్‌ఐఆర్ అమలు తీరుపై గురువారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, అదనపు ఏఈఆర్‌ఓలతో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రక్రియ అమలు తీరును వివరించారు. నియోజకవర్గాల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న అదనపు సీఈఓ క్షుణ్ణంగా సమీక్షించారు.

ముఖ్యంగా ఏఎస్‌డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డిలీటెడ్) జాబితా రూపకల్పనలో అనుసరించిన మార్గదర్శకాలు, పద్ధతులపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం మరికొంత గడువు పొడిగించిన నేపథ్యంలో ఏఎస్‌డీడీ జాబితాను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి జాబితాలోని ప్రతి ఓటరును పునఃపరిశీలించాలని ఆదేశించారు. పొరపాట్లు గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకునేందుకు అవకాశం ఉందన్నారు.

అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదని, అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదని స్పష్టం చేశారు. తుది ఓటరు జాబితా ప్రకటించిన తర్వాత అర్హుల నుంచి ఫిర్యాదులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆబ్సెంట్, షిఫ్టెడ్ కేసులను నిశితంగా పరిశీలించాలన్నారు. ఏఎస్‌డీడీ జాబితా తయారీలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొంటూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జాబితాలోని వివరాలను పరిశీలించి బీఎల్‌ఏల సంతకాలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>