కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమం రాస్తే రామాయణం, చెప్తే భారతం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. అచ్చంపేట బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రంగా తెలంగాణను అప్పగిస్తే గత బీఆర్ఎస్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పులు చేసి తెలంగాణను దివాళా తీయించారని మండిపడ్డారు. మూడేళ్ళల్లో రూ.1 లక్ష 78 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసి రైతుల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. గడ్డం పెంచుకున్న ప్రతీ అడ్డగాడిద రేవంత్ రెడ్డి కాలేరంటూ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందని బీఆరెస్ మళ్లీ అధికారంలోకి వస్తామంటోంది? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆరెస్ రెండు విడివిడిగా కాకుండా కలిసి రావాలని.. అసెంబ్లీలో తమ లెక్క తెలుస్తానంటూ సవాల్ విసిరారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

