కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని కాకతీయుల కాలం నాటి చారిత్రక త్రికూట శివాలయానికి (Trikuta Temple) పూర్వవైభవం తీసుకొచ్చేందుకు గ్రామస్తులు, ఆలయ కమిటీ నడుం బిగించారు. శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయాన్ని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆలయ అభివృద్ధికి పురావస్తు శాఖ కూడా ప్రణాళిక రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది.
కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ త్రికూట శివాలయం కాలక్రమేణా వివిధ కారణాలతో శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని గ్రామస్తులు, ఆలయ కమిటీ సంకల్పించారు. ఇందులో భాగంగా మాజీ ఉపసర్పంచ్, సీనియర్ అడ్వకేట్ బండ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆలయాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన శివుని చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపల్లి చిన్నగుట్ట గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి విచ్చేసిన సురేష్ ఆత్మారం గురూజీ దృష్టికి గ్రామస్తులు, బండ గోపాల్ రెడ్డి ఈ పురాతన ఆలయ విషయాన్ని తీసుకెళ్లారు. ఆలయాన్ని పరిశీలించిన గురూజీ.. భక్తులు దీపాలు వెలిగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో కార్తీక పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించారు.
పురావస్తు శాఖ పరిశీలన.. శరవేగంగా పనులు
ఈ సందర్భంగా బండ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయుల కాలంలో ఈ త్రికూట శివాలయాన్ని నిర్మించినట్లు తమ పూర్వీకులు చెప్పేవారని తెలిపారు. కాలక్రమేణా వివిధ కారణాలతో ఆలయంలో పూజలు నిలిచిపోయాయని, ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ఆలయాన్ని పరిశీలించారని తెలిపారు. త్రికూట ఆలయ అభివృద్ధికి తగిన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించినట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే గ్రామస్తులంతా ఏకమై ఆలయం చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తాచెదారాన్ని తొలగించి ఆలయ మరమ్మతు, సుందరీకరణ పనులు చేపట్టారు. త్వరలోనే ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు శివుని దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవడంతో పాటు భావితరాలకు అందించడమే తమ లక్ష్యమని గ్రామస్తులు, ఆలయ కమిటీ స్పష్టం చేశారు.

