కలం, వెబ్ డెస్క్: శ్రీ హనుమాన్ జయంతి (Shri Hanuman Jayanti) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అచంచలమైన భక్తి, అపారమైన శక్తి, అజేయమైన ధైర్యానికి ప్రతీకగా ప్రతి హృదయంలో వెలుగొందే భగవంతుడు హనుమంతుడిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ హనుమంతుడిలా ధైర్యసాహసాలతో, నిస్వార్థ సేవాభావంతో, అపార సహనంతో జీవించాలని, మనిషిలోని భయాలను జయించి, సత్యం, ధర్మమార్గంలో ముందుకు సాగేందుకు హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. సంత్ తులసీదాస్ తన రామచరిత మానస్‌లో చెప్పినట్టు అంజనీ సుతుడు “జ్ఞానినాం అగ్రగణ్యం” అంటే జ్ఞానుల్లో అత్యున్నతుడు అని కేసీఆర్ పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు అన్నట్టు “న వాక్యదోషం.. నచ అపశబ్దం” అంటే ఎటువంటి దోషాలు లేని భాషతో, ఉచ్చారణతో, వ్యాకరణం మీద పట్టుతో వాక్ శుద్ధితో ప్రసంగించే గొప్ప వక్త హనుమంతుడు అని కొనియాడారు. ధర్మ రక్షణ కోసం, తాను నమ్మిన శ్రీ రామునికి తన శక్తినంతా ధారపోసి, ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేకుండా, ప్రజా సంక్షేమం కోసం నాయకత్వాన్ని తన భుజాలమీద మోసిన బలశాలి, వినయానికి, విజయానికి మార్గదర్శి, మృదుస్వభావి శ్రీ ఆంజనేయ స్వామి అని పేర్కొన్నారు. వారి ఆచరణ ఎల్లకాలం ఆదర్శనీయమని, నేటి యువతరానికి ఆచరణీయమని తెలిపారు. ఆదర్శవంతమైన ఆలోచనలతో, దూరదృష్టితో, తమ జీవితాలను తీర్చిదిద్దుకునే శక్తిని హనుమంతుడు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ప్రగతి తిరిగి పుంజుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని ప్రార్ధించారు.
హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy ) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అపారమైన బుద్ధిబలం, తిరుగులేని ధైర్యం, నిస్వార్థ సేవకు నిలువుటద్దం మన ఆంజనేయ స్వామి అని పేర్కొన్నారు. ఆ వాయుపుత్రుని ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. హనుమంతుని కృపతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యానికి, శక్తికి ప్రతీక.. భక్తికి నిలువుటద్దం అయిన ఆ రామదూత ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
తెలంగాణలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు జరుగనున్నాయి. గ్రామాల్లోని హనుమంతుడి ఆలయంలో అభిషేకాలు, పూజలు, అన్నదానం చేయనున్నారు. జై శ్రీరామ్ – జై హనుమాన్ అంటూ గ్రామ గ్రామాన భక్తి పారవశ్యం వెల్లివిరియనుంది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి అర్చకులు ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు చేస్తున్నారు. యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయం కొండగట్టులో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామి చెంతకు మాలధారణ భక్తులు విశేషంగా చేరుకుంటున్నారు. శ్రీ రామ జయరామ జయజయరామ అంటూ కొండగట్టు గిరులు మారుమ్రోగుతున్నాయి. కొండగట్టు గిరిప్రదక్షిణ చేస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Read Also: అసమర్ధ మంత్రులు వీరే.. హైకమాండ్‌కు ‘కాంగ్రెస్ ఫ్రెండ్స్’ సంచలన లేఖ..
Follow Us On: Instagram

