కలం, వెబ్‌డెస్క్: చీపురు (Broom) అనేది ప్రతి ఇంట్లోనూ నిత్యం ఉపయోగించే అత్యంత ప్రాథమిక, ముఖ్యమైన గృహోపకరణం. ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి చీపురును ఒక ప్రధాన సాధనంగా వాడుతున్నారు. ఇది కేవలం ఒక శుభ్రపరిచే వస్తువు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
హిందూ ధర్మం, వాస్తు శాస్త్రం (Vastu Shastra) లో చీపురును లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. అందుకే చీపురును ఉపయోగించే విధానం, ఉంచే స్థానం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు పండితులు. ఈ నియమాలు ఏంటో, అవి పాటించకపోతే కలిగే అనర్థాలు ఏమిటో నిపుణులు వివరించారు. అవేమిటో తెలుసుకుందామా?
చీపురును ఈ దిశలో ఉంచాలి
వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును దక్షిణం లేదా నైరుతి మూలలో దాచిపెట్టి ఉంచడం మంచిదిగా భావిస్తారు పండితులు. అయితే ఈశాన్య దిశలో చీపురును ఉంచడం అశుభంగా పరిగణిస్తారు. ఈ దిశ దేవతల స్థానం, సానుకూల శక్తి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించబడుతుందట. అక్కడ చీపురును ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు, అనవసర ఖర్చులు పెరిగే అవకాశముందని చెబుతారు.
ఇల్లు ఊడ్చడానికి సరైన సమయం
వాస్తు ప్రకారం ఉదయం సమయంలో ఇల్లు ఊడ్చడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని నమ్ముతారు. అయితే సూర్యాస్తమయం తర్వాత ఊడ్చడం మంచిది కాదని చెబుతారు. ముఖ్యంగా రాత్రిపూట చెత్తను బయటకు వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని అనాదిగా వస్తున్న విశ్వాసం. ఒకవేళ సాయంత్రం శుభ్రం చేయాల్సి వస్తే, చెత్తను ఒకచోట పోగు చేసి మరుసటి రోజు బయటకు వేయడం మంచిదని సూచిస్తారు.
చీపురుపై అడుగు పెట్టడం ఎందుకు అశుభం?
చీపురుపై అడుగు పెట్టడం లేదా దానిని దాటడం వాస్తు ప్రకారం అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి అవమానం చేసినట్లవుతుందని, దాని ప్రభావంగా ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడులు ఎదురవుతాయని చెబుతారు పండితులు. అనుకోకుండా ఇలా జరిగితే మౌనంగా క్షమాపణ చెప్పడం శుభప్రదంగా భావిస్తారట. చీపురును ఎప్పుడూ అందరికీ కనిపించేలా ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతారు. దాన్ని తలుపు వెనుక, స్టోర్‌రూమ్‌లో ఉంచడం ఉత్తమమట. ఇంటి బయట లేదా ప్రధాన ద్వారం దగ్గర చీపురును ఉంచడం వల్ల ఇంట్లోని సానుకూల శక్తి తగ్గుతుందని నమ్మకం. ఈ చిన్నచిన్న వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో శుభం, శాంతి, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయని విశ్వసిస్తారు నిపుణులు.

