కలం, స్పోర్ట్స్: ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్(AFCON) ఛాంపియన్ ఎవరన్నది మంగళవారం తేలనుంది. సెనెగల్, మొరాకో మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫలితం దాదాపు పదినెలల తర్వాత రానుంది. దీంతో ఇప్పుడు అసలు టైటిల్.. సెనెగల్‌దా? మొరాకోదా? అన్న ఉత్కంఠకు తెరదించుతూ క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానం (సీఏఎస్) నవంబర్ 24న తుది తీర్పు వెల్లడించనుంది. సెనెగల్ దాఖలు చేసిన అప్పీల్‌పై ఈ నిర్ణయం వెలువడనుంది. జనవరిలో జరిగిన ఫైనల్‌లో మొరాకోపై సెనెగల్ 1-0తో గెలిచింది.
అయితే మ్యాచ్ చివర్లో మొరాకోకు పెనాల్టీ ఇవ్వడంపై సెనెగల్ ఆటగాళ్లు నిరసనగా మైదానం వీడారు. దీంతో 15 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమై, అదనపు సమయంలో సెనెగల్ విజయం సాధించింది. అయితే ఈ ఘటనను నిబంధనల ఉల్లంఘనగా పరిగణించిన ఆఫ్రికన్ ఫుట్‌బాల్ సమాఖ్య (సీఏఎఫ్).. మార్చిలో ఫలితాన్ని రద్దు చేసింది.
మొరాకోకు 3-0తో విజయం ప్రకటించి టైటిల్‌ను కట్టబెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ సెనెగల్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. రిఫరీ నిర్ణయాల ప్రకారం మ్యాచ్ పూర్తయిందని, మైదానంలో వచ్చిన ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ముగ్గురు సభ్యుల న్యాయమూర్తుల బృందం ఇప్పుడు తుది నిర్ణయం ప్రకటించనుంది. ఈ తీర్పుతో అఫ్కాన్ టైటిల్ వివాదానికి ముగింపు పడనుంది.

