కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల (Jagtial)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్ కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రీయ విద్యాలయం అంశంపై మాట్లాడుతున్న ఒక బీసీ మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వారు మండిపడ్డారు.
ప్రభుత్వ కార్యక్రమమా? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా?
ఇటీవల కలెక్టరేట్‌లో ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన “ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ విజయోత్సవం” ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా నిర్వహించారని ఓరుగంటి చంద్రశేఖర్ ఆరోపించారు. ఎటువంటి అధికారిక పదవులు లేని కాంగ్రెస్ నాయకులు నందయ్య, గిరినాగభూషణం, బండ శంకర్‌లను అధికారులతో పాటు వేదికపై కూర్చోబెట్టడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిసిసి అధ్యక్షుడు నందయ్యకు కేంద్రీయ విద్యాలయంలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటే తప్పా?
తమ నాయకురాలు భోగ శ్రావణి స్థానిక నాయకురాలు కాదని, ఆమె ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలని, అందుకే పార్టీ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఆమె భర్త డాక్టర్ ప్రవీణ్ హైదరాబాద్‌లో వృత్తిరీత్యా వైద్యుడిగా సేవలు అందిస్తున్నారని, గతంలో ఎమ్మెల్యే కూడా ఆయన వద్ద చికిత్స చేయించుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉంటే తప్పు లేనప్పుడు, శ్రావణి పిల్లలు అక్కడ చదువుకుంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్ మాట్లాడుతూ.. ఒక బీసీ మహిళా నాయకురాలు రాజకీయంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక, ఎమ్మెల్యే ప్రేరేపణతోనే నందయ్య మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా కార్యదర్శి పాత రమేశ్, ఆముద రాజు, దూరిశెట్టి మమత, మేడిపల్లి పుష్ప, ఇట్యాల రాము, పవన్ సింగ్, సింగం పద్మ, మామిడాల కవిత, సిరిపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: యాదాద్రి జిల్లా ప్రజల ఆశలపై సీఎం నీళ్లు : బీఆర్ఎస్ నేత రామచంద్రారెడ్డి
Follow Us On: X(Twitter)

