కలం, స్పోర్ట్స్: లక్నో వేదికగా మంగళవారం సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వాలిఫైయింగ్ రౌండ్లతో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టాప్ సీడ్లుగా బరిలోకి దిగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్లు ట్రీసా జాలీ (Treesa Jolly), గాయత్రి గోపీచంద్ హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేశారు. 2024, 2025లలో ఇక్కడ విజేతలుగా నిలిచిన ఈ భారత జోడీ, ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ సాధించిన తొలి భారత మహిళల డబుల్స్ జంటగా చరిత్ర సృష్టిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన 2026 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన వీరు, ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని చూస్తున్నారు. తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో తలపడనున్న వీరికి, ఉక్రెయిన్, మలేషియా సీడెడ్ జోడీల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
పురుషుల సింగిల్స్‌లో..
పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లో తైవాన్ ఆటగాడు జె యింగ్ వుతో తలపడతాడు. తరుణ్ మన్నెపల్లి ఎనిమిదో సీడ్‌గా, సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ టెహ్ టాప్ సీడ్‌గా బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి రికు గుజి టాప్ సీడ్ కాగా, భారత్ నుంచి తన్వి శర్మ రెండో సీడ్‌గా, ఉన్నతి హుడా మూడో సీడ్‌గా, అష్మిత చలిహా ఐదో సీడ్‌గా పోటీ పడుతున్నారు. 2009లో గ్రాండ్ ప్రిగా మొదలై, 2018లో సూపర్ 300 స్థాయికి చేరిన ఈ టోర్నీ, ఆ స్థాయిలో జరగడం ఇదే చివరిసారి. వచ్చే ఏడాది నుంచి ఇది సూపర్ 100 టోర్నీగా మారనుంది. గతంలో ఇక్కడ సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ టైటిళ్లు గెలిచారు. ఈ సారి కూడా భారత షట్లర్లు మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నారు.

