epaper
Wednesday, February 18, 2026
epaper

విద్వేష ప్రసంగాల నియంత్రణకు చట్టం : సీఎం రేవంత్​

కలం, వెబ్​ డెస్క్​ : విద్వేష ప్రసంగాల నియంత్రణపై సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నామని ఆయన తెలిపారు. జమీయత్ ఉలమా-యే-హింద్ సంస్థ నిర్వహించిన సభలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో జమీయత్ ఉలమా సంస్థ, కాంగ్రెస్ పార్టీలు పోరాడాయని, మైనారిటీలు, మెజారిటీ ప్రజలు కలిసి మెలిసి ముందుకు సాగడానికి ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

మల్కాజిగిరి (Malkajgiri) లోక్‌సభ ఎన్నికల్లో జమీయత్ స్వచ్ఛందంగా సహకరించిందని, హిందువులతో పాటు ముస్లింలు తనను గెలిపించి పార్లమెంటుకు పంపడం వల్లే తాను గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లగలిగానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీకి తోడుగా మోదీ, అమిత్ షా పైన తాము పోరాటం చేశామని, మైనారిటీల అండతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన తెలిపారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా షోయబుల్లా ఖాన్ వంటి వారు చేసిన పోరాటాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎందరో మైనారిటీ నేతలకు సముచిత స్థానం కల్పించిందని తెలిపారు.

జాతీయ స్థాయిలో సల్మాన్ ఖుర్షీద్, అహ్మద్ పటేల్ వంటి వారు అగ్ర నాయకులుగా ఎదిగారని, రాష్ట్రంలో అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చామని ఆయన వివరించారు. అవకాశం ఉన్న ప్రతి చోటా మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ 8 కార్పొరేషన్ పదవులను వారికి అప్పగించామని, అజారుద్దీన్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేశామని చెప్పారు. పార్టీ టిక్కెట్లు ఇచ్చినప్పుడు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు.

ఏ ఒక్కరి వల్ల దేశం అభివృద్ధి చెందదని, అలాగే ఎవరూ పదవిలో శాశ్వతంగా ఉండలేరని ఆయన చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారిటీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, రాష్ట్రంలో నిర్వహించిన కులగణనలో మైనారిటీల జనాభాను కూడా లెక్కించామని తెలిపారు. కోర్టులో విచారణ జరిగినప్పుడు ఈ గణాంకాలను సమర్పించి, రిజర్వేషన్లు అమలయ్యేలా పూర్తి కృషి చేస్తామని తెలిపారు.

మైనారిటీలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన గుర్తు చేశారు. మైనారిటీల 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందిస్తూ, దమ్ముంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని తాను సవాల్ విసిరానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. ఒక పార్టీ చేసిన అవయవ దానం వల్లే తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

Read Also: కాంగ్రెస్ – బీఆర్ఎస్ తోడు దొంగలు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>