కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఎక్కడ చూసినా ‘స్పెషల్ ఇంటెన్సివ్ విజన్’ (సర్) మాటే వినిపిస్తోంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన వారికి కొత్తగా ఓటు హక్కు కల్పించడంతో పాటు, మృతి చెందిన వారి ఓట్లను తొలగించడం, నకిలీ ఓట్ల ఏరివేత, పేరు, వయస్సు, అడ్రస్ లోని తప్పులను సరిచేయడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యం. ఈసీ షెడ్యూల్ ప్రకారం జులై 31న ముసాయిదా జాబితా విడుదల, ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలు, సవరణల స్వీకరణ, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రాజకీయ పార్టీల్లో తీవ్ర గుబులు రేపుతోంది. ఒకవైపు ఓట్ల మ్యాపింగ్ కష్టాలు, మరోవైపు ఓటర్ల తొలగింపు ప్రక్రియపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో లీడర్లకు చెమటలు పడుతున్నాయి.
బీఎల్ఏలను రంగంలోకి దించిన పార్టీలు..
‘సర్’ ప్రక్రియ ఇప్పుడు రాజకీయ పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. చనిపోయిన వారు, తప్పుడు చిరునామా ఉన్న వారి ఓట్లను మాత్రమే తీసేస్తామని ఈసీ చెబుతున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఓటర్ల ప్రక్షాళన చేస్తోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అప్రమత్తమైన పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను (BLA) రంగంలోకి దించి ప్రత్యేక శిక్షణ శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నెల రోజులుగా నియోజకవర్గ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణపై దిశానిర్దేశం చేస్తూ వస్తున్నాయి.
నిలిచిన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ..
తెలంగాణలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 29,88,973 ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 24,08,370 మంది ఓటర్లను మాత్రమే బీఎల్ఓలు మ్యాపింగ్ చేశారు. అంటే ఇంకా 5,80,603 ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. సర్వే అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ఓటర్లలో అయోమయం నెలకొంది. 2002 నాటి ఓటర్ల జాబితా ప్రకారం 2025/2026 నాటి ఓటర్లను పోల్చి బీఎల్వోలు మ్యాపింగ్ చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా 84.11 శాతంతో అగ్రపథంలో ఉండగా, జగిత్యాల 73.77 శాతంతో వెనుకబడి ఉంది. పట్టణాల్లో అద్దె ఇళ్లు మారడం, వలస వెళ్లిన వారి వివరాలు దొరకకపోవడంతో మ్యాపింగ్ ప్రక్రియ నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. తమ ఓట్లు ఎక్కడ గాల్లో కలిసిపోతాయోనని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
- జగిత్యాల జిల్లా: 7,21,032 ఓటర్లకు గాను 5,81,974 మ్యాపింగ్ పూర్తి
- పెద్దపల్లి జిల్లా: 7,12,157 ఓటర్లకు గాను 5,74,051 మ్యాపింగ్ పూర్తి
- కరీంనగర్ జిల్లా: 10,89,030 ఓటర్లకు గాను 8,52,245 మ్యాపింగ్ పూర్తి
- రాజన్న సిరిసిల్ల జిల్లా: 4,75,694 ఓటర్లకు గాను 4,00,100 మ్యాపింగ్ పూర్తి
ఓటు కోల్పోయే ప్రమాదం..
జూలై 14వ తేదీ లోగా ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించని వారి పేర్లు ముసాయిదా జాబితాలో కనిపించకపోవచ్చని చెబుతున్నారు. కాబట్టి ప్రజలంతా బీఎల్వోలకు సహకరించి తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు, జీవనోపాధి కోసం ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ‘సర్’ సర్వే సమయంలో అందుబాటులో లేకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

