కలం, వెబ్ డెస్క్ : ఆసియా ఫుట్‌బాల్ శక్తిగా పేరొందిన సౌత్ కొరియాకు (South Korea) ఫిఫా వరల్డ్‌కప్‌లో ఘోర నిరాశ ఎదురైంది. టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తుందనే అంచనాల మధ్య బరిలోకి దిగిన కొరియా జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం హెడ్ కోచ్ హాంగ్ మ్యుంగ్-బో (Hong Myung-bo) ప్రెస్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ దేశ జాతీయ ప్రసార సంస్థ ‘కేబీఎస్’ కోచ్ ముఖాన్ని టీవీలో బ్లర్ చేసి ప్రసారం చేసిందంటూ ప్రచారం జరిగింది. అయితే అసలు ప్రసార వీడియోను పరిశీలించగా అందులో ఎలాంటి బ్లరింగ్ లేదని, వైరల్ అవుతున్న వీడియో నకిలీదని స్పష్టమైంది.
ఈ వరల్డ్‌కప్‌లో సౌత్ కొరియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌పై విజయం సాధించిన జట్టు, అనంతరం మెక్సికో, సౌత్ ఆఫ్రికా చేతిలో వరుస పరాజయాలు చవిచూసింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడంతో పాటు ఉజ్బెకిస్తాన్‌పై రిపబ్లిక్ ఆఫ్ కాంగో విజయం సాధించడంతో కొరియా నాకౌట్ అవకాశాలు పూర్తిగా ముగిశాయి. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ హాంగ్ మ్యుంగ్-బో తన పదవికి రాజీనామా చేశారు. అభిమానులు, దేశ ప్రజలు ఆశించిన ఫలితాలను అందించలేకపోయానని, ఈ పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని ఆయన పేర్కొన్నారు. పదవి నుంచి తప్పుకున్నప్పటికీ సౌత్ కొరియా ఫుట్‌బాల్ అభివృద్ధికి తన మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు.
మరోవైపు ఈ పరాజయంపై సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమర్థత కంటే గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే జట్టు ఈ పరిస్థితికి చేరుకుందని విమర్శించారు. జాతీయ ఫుట్‌బాల్ జట్టు నిర్వహణ, ఎంపిక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరాజయం నేపథ్యంలో సౌత్ కొరియా ఫుట్‌బాల్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో, జట్టు తిరిగి ఎలా పుంజుకుంటుందో ఆసక్తికరంగా మారింది.

