కలం, జోగులాంబ గద్వాల: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పష్టం చేశారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి బాసు హనుమంతు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు.
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గద్వాల నియోజకవర్గంలో ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ప్రాజెక్టుల పనులు వేగంగా జరిగాయని ప్రవీణ్ కుమార్ కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పెండింగ్ పనులు “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్న చందంగా మారాయని విమర్శించారు. మొన్నటి గద్వాల పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులపై ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు.
ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి..
చిన్న కాలువల్లో పెరిగిన చెట్లను కూడా తొలగించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని.. గద్వాల ప్రజల సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న కుంభకోణాలపై బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తోందని తెలిపారు. తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, పుస్తకాలు, ఇతర సామగ్రి అందే వని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం నాసిరకం వస్తువులతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నా ప్రాణాలకు రేవంత్ రెడ్డిదే బాధ్యత..
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా తన భద్రతను కుదించడంపై ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 26 ఏండ్లు ఐపీఎస్ అధికారిగా దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశానని, రాష్ట్రపతి శౌర్యపతకం కూడా పొందానని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం తన సెక్యూరిటీని తగ్గించలేదని, నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ సర్కార్ ఈ కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు. తన భద్రతను తొలగించినా, బెదిరించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపనని, ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌ను వీడేది లేదని స్పష్టం చేస్తూ, తన ప్రాణాలకు రేవంత్‌రెడ్డిదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, జి.రాఘవేంద్ర రెడ్డి, అంగడి బసవరాజ్, ఆతికూర్ రెహమాన్, కౌన్సిలర్ చంటన్న, కురవ పల్లయ్య, చిన్నపాడు ఆంజనేయులు, మోనేష్, గంజిపేట రాజు, చక్రధర్ రెడ్డి, మక్బుల్, తిమ్మప్ప గౌడ్, వెంకటేష్ నాయుడు, నూర్ పాషా, శ్రీరాములు, ముని మౌర్య, గోవిందు, కావలి గోపి, గాజుల కృష్ణారెడ్డి, డ్యామ్ శ్రీను, సామెలు, ఇంజన్న, మాలిక్, రాము, రమేష్, తిమ్మప్ప, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

