కలం, వెబ్ డెస్క్ : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అలర్ట్ జారీ చేసింది. వివిధ ప్రాంతాల్లో ట్రాక్ నిర్వహణ, భద్రతా కారణాల దృష్ట్యా ఏప్రిల్ 12, 2026 వరకు దాదాపు 15 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల మధ్య నడిచే మెము (MEMU), డెము (DEMU) రైళ్లు ఈ రద్దు జాబితాలో ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కాచిగూడ, గుంటూరు, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి నడిచే లోకల్ రైళ్లు ఎక్కువగా రద్దయ్యాయి. ప్రయాణికులు ప్రయణానికి ముందు రైల్వే ఎంక్వయిరీ లేదా NTES యాప్ ద్వారా రైళ్ల స్థితిగతులను చెక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
విజయవాడ – విశాఖపట్నం (07466/07467), కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (07456/07457), విజయవాడ – తెనాలి (07282/07279), విజయవాడ – ఒంగోలు (07278/07476), గుంటూరు – తెనాలి (07575/07440), విశాఖపట్నం – మచిలీపట్నం (17220), మచిలీపట్నం – విశాఖపట్నం (17219) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు. కొన్ని రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు చెప్పారు. వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇబ్బందికరమైనప్పటికీ.. సురక్షిత ప్రయాణం కోసం ట్రాక్ మరమ్మతులు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రయాణికుల సెప్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

