కలం, మక్తల్: కుటుంబ కలహాలతో కన్న తండ్రిని కొడుకులే కొట్టి చంపిన ఘటన నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం తిరుమలాపూర్ (Tirumalapur)లో సోమవారం జరిగింది. కొల్పూర్ రాములు (60) కు ఇద్దరు కొడుకులు కృష్ణ, వెంకట్రాములు ఉన్నారు. పొలం విషయంలో కొంతకాలంగా తండ్రి, కొడుకుల మధ్య కలహాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రెండు రోజులుగా ఇంటికి తాళం వేసిన కొల్పూర్ రాములు తన కొడుకులను ఇంట్లోకి రావద్దని గొడవ పడుతున్నాడు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం తండ్రిని ఇంట్లోకి లాక్కెళ్లిన కృష్ణ, వెంకట్రాములు కంట్లో కారం చల్లి, ఇనుప పలుగుతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ రాములు మృతి చెందాడు. మృతుడి సోదరుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మక్తల్ ఎస్సై పి.రాజు తెలిపారు.

