కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 ముందు ఐపీఎల్లో కీలక మార్పులు జరిగాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) ఖరారయ్యాడు. సీఎస్కే కోచ్ విషయంలో స్వదేశీ వ్యక్తినే తీసుకోవాలన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయింది. ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ కీలక బాధ్యతలు చేపట్టనున్నాడంటూ ఫ్రంఛైజీ అధికారికంగా ప్రకటించింది.ఫ్లెమింగ్ 2009 నుంచి 2026 వరకు సీఎస్కే హెడ్ కోచ్‌గా కొనసాగాడు. వరుసగా మూడో సీజన్లోనూ చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరకపోవడంతో ఫ్లెమింగ్‌తో జట్టు విడిపోయింది.
జహీర్‌కు ఐపీఎల్లో మంచి అనుభవం ఉంది. ఆటగాడిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రీమియర్ లీగ్‌లో జహీర్ మొత్తం 100 మ్యాచ్‌లు ఆడాడు. 102 వికెట్లు పడగొట్టాడు. 2017లో టోర్నీకి ఆటగాడిగా వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టాడు. 2019 సీజన్‌కు ముందు ఆ జట్టుకు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత గ్లోబల్ డెవలప్మెంట్ హెడ్‌గా కొనసాగాడు. ఇప్పుడు 2027 ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

