కలం, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త దుశ్చర్ల సత్యనారాయణ (Dusharla Satyanarayana)పై గొర్రెల కాపర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. రాఘవాపురంలోని 70 ఎకరాల విస్తీర్ణంలో ఒక చిట్టడవిని సృష్టించారు. ఈ క్రమంలోనే గొర్రెలు మేపే విషయమై.. దుశ్చర్ల సత్యనారాయణతో గొర్రెల కాపర్లు ఒక్కసారిగా వాగ్వాదానికి దిగారు. వివాదం ముదరడంతో సుమారు ఎనిమిది మంది గొర్రెల కాపర్లు కర్రలతో ఆయనపై దాడికి తెగబడ్డారు.
తల భాగంలో తీవ్రమైన దెబ్బలు తగలడంతో సత్యనారాయణ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు.. వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లోరోసిస్ విముక్తి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం గొంతు ఎత్తిన సీనియర్ నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణపై దాడి జరగడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.

