epaper
Wednesday, February 18, 2026
epaper

ఫోన్ ట్యాపింగ్‌లో ట్విస్ట్.. ఆ మిస్సింగ్ లింక్స్ పై సస్పెన్స్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో విచారణ జరిపిన సిట్ పోలీసులకు కొన్ని వివరాలు ఇంకా లభ్యం కావాల్సి ఉన్నది. ఇప్పటివరకు విచారించినవారి నుంచి కీలక అంశాలు వెల్లడైనా ఇంకా కొన్ని గ్యాప్స్ మాత్రం అలాగే మిగిలిపోయాయన్నది పోలీసు వర్గాల సమాచారం. ఆ మిస్సింగ్ లింక్స్ గురించి లోతైన వివరాలు రాబట్టడంపైనే ఇప్పుడు సిట్ (SIT) అధికారులు దృష్టి సారించారు. ఇకపైన ఎవరిని పిలుస్తారు? వారి నుంచి మిస్సింగ్ పార్ట్ వివరాలను ఏ మేరకు రాబడతారన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో ఆ మిస్సింగ్ లింక్స్ కు సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల వ్యూహం ఎలా ఉండబోతుందన్నది కీలకం. ఇప్పటివరకు పోలీసుల దగ్గరున్న ఎవిడెన్సుల్లోని కొన్ని ఫోన్ నెంబర్లపై ఆరా తీయడం మొదలైంది.

సినీ నటుల నెంబర్లపైనే సీరియస్ ఫోకస్ :

గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తల ఫోన్లను నిఘా విభాగం నిర్దిష్ట లక్ష్యం కోసం ట్యాప్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ కోణం నుంచి ఇప్పటికే సిట్ పోలీసులు విచారణ సందర్భంగా పలువురి నుంచి వివరాలను రాబట్టారు. ఆ జాబితాలో కొద్దిమంది సినీ నటుల నెంబర్లు సైతం ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించిందని, వారి ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న అంశంపై ఫోకస్ పెట్టినట్లు పోలీసుల సమాచారం. వారి నెంబర్లను ఇచ్చిందెవరు? ట్యాపింగ్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ను అప్పటి పోలీసులు రాబట్టాలనుకున్నారు? దాని ద్వారా వచ్చిన సమాచారమేంటి?.. ఆ సమాచారం ఏ అవసరాలకు ఉపయోగపడింది? ఆ సినీ నటుల నెంబర్లతో ఎవరెవరు మాట్లాడారు?.. ఇలాంటి వివరాల కోసం సిట్ అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

యాక్టర్స్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ ఫైర్ :

సినీ నటుల ఫోన్లను ట్యాపింగ్ (Film Stars Phone Tapping) చేసినట్లు వచ్చిన ఆరోపణలకు కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లుగా వార్తలు రాయించిన కాంగ్రెస్ లీడర్లు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతీకారంతోనే కాంగ్రెస్ లీడర్లు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయాలంటూ తాను ఆదేశించినట్లు ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని ఇటీవల విచారణ సందర్భంగా సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారులను అడిగానని కేటీఆర్ గుర్తుచేశారు. ఎలాంటి సమాధానం వారి నుంచి రాలేదని పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న కథనాలన్నీ లీకుల ద్వారా సృష్టించిన అబద్ధాలని ఆయన అన్నారు. టాలీవుడ్ సెలెబ్రిటీల ఫోన్లను కొన్ని నిర్దిష్ట కారణాల కోసం ట్యాపింగ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా గతంలో ఓ మంత్రి సైతం కామెంట్లు చేయడం, అది వివాదాస్పదం కావడం, ఆ తర్వాత బహిరంగంగా వివరణ ఇవ్వడం గమనార్హం.

డేటా ధ్వంసం తర్వాత మాయమయ్యాయా?

టాస్క్ ఫోర్స్ రిటైర్డ్ డిప్యూటీ పోలీసు కమిషనర్ రాధాకిషన్‌రావు సిట్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అప్పటి ఎస్ఐబీ ఇన్‌స్పెక్టర్ ప్రణీత్ రావు ఉద్దేశపూర్వకంగానే డేటాను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా దాదాపు ఆరు వేల ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచి కీలక సమాచారాన్ని అప్పట్లో రాబట్టినట్లు వచ్చిన ఆరోపణలపై సిట్ ఆరా తీసింది. అయితే అందులో సినీ సెలెబ్రిటీల ఫోన్ నెంబర్లు లేవని సూచనప్రాయంగా అనధికారికంగా పేర్కొన్నది. కానీ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటివరకు విచారించినవారి నుంచి రాబట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ మిస్సింగ్ లింక్స్ సస్పెన్స్ గానే ఉండి పోయాయన్నది ఇన్వెస్టిగేషన్‌తో సంబంధం ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ పేర్కొన్నారు. సినీ సెలెబ్రిటీల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు అనుమానం ఉన్నా ధృవీకరించేలా ఎలాంటి ఆధారాలు ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గర లేవని తెలిపారు. రానున్న రోజుల్లో జరిగే దర్యాప్తు, సప్లిమెంటరీ చార్జిషీట్లలో ఎలాంటి వివరాలను పొందుపరుస్తుందనేది కీలకంగా మారింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో ప్రత్యేక కథనం ఈరోజు సాయంత్రం 5 గంటలకు Kalamdaily.com వెబ్సైట్ లో

Read Also: ప్రైవసీతో ఆటలొద్దు.. ‘మెటా’ డేటా చోరీపై సుప్రీం ఆగ్రహం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>