epaper
Wednesday, February 18, 2026
epaper

ప్రైవసీతో ఆటలొద్దు.. ‘మెటా’ డేటా చోరీపై సుప్రీం ఆగ్రహం

కలం, తెలంగాణ బ్యూరో : ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా ‘మెటా’ (Meta) కంపెనీ వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగించే చర్యలపై సుప్రీంకోర్టు (Supreme Court)  తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రజల డేటాతో ఆటలాడుకోవద్దని హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయుల వ్యక్తిగత వివరాలను, ప్రైవసీకి సంబంధించిన అంశాలను చోరీ (Data Privacy Violations) చేయడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని మందలించింది. ఈ దేశ హక్కులతో ఆటలాడుకునే ప్రసక్తే ఉండదని, చిన్న సమాచారాన్ని సైతం ఏ రూపంలోనూ ఎవ్వరికీ షేర్ చేయడాన్ని అంగీకరించబోమని మెటా సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. భారత కాంపెటిషన్ కమిషన్ విధించిన రూ. 213 కోట్ల జరిమానాను సమర్ధిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మెటా సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మలా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిత కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

యాడ్స్, ఆదాయం కోసం డేటా షేర్ చేస్తారా? :

వాణిజ్య ప్రకటనల కోసం, ఆదాయాన్ని ఆర్జించడం కోసం భారతీయుల వ్యక్తిగత వివరాలను షేర్ చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చర్య అని బెంచ్ స్పష్టం చేసింది. సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి మెటా సంస్థ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ ప్లాట్‌ఫామ్ గుత్తాధిపత్యం వహిస్తున్నదని, వినయోగదారులకు మరో దారి లేకపోవడంతో దీన్ని మెటా అవకాశంగా తీసుకున్నదని పేర్కొన్నది. డేటాను దుర్వినియోగం చేస్తున్నదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం వచ్చిన వాట్సాప్ ద్వారా వ్యక్తుల డేటాను చోరీ చేయడానికి ఒక నాగరికమైన మార్గంగా మెటా సంస్థ ఎన్నుకున్నదని, దీన్ని అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఒక రకంగా భారత రాజ్యాంగబద్ధతనే అవహేళన చేసినట్లయిందని పేర్కొన్నది. ఆన్‌లైన్ యాడ్స్ కోసం, దాని ద్వారా వచ్చే ఆదాయానికి వినియోగదారుల వ్యక్తిగత వివరాలతో కూడిన డేటాను ఎలా వాడతారని సుప్రీం (Supreme Court) నిలదీసింది.

ప్రైవసీ పాలసీ ఎవరికైనా అర్థమవుతుందా? :

మెటా సంస్థ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగీ లేవనెత్తిన ప్రైవసీ పాలసీపైనా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. “వాట్సాప్ సర్వీసులు వాడుకున్న ఎవరికైనా ఈ పాలసీ అర్థమవుతుందా?.. వీధుల్లో కూరగాయలు అమ్ముకునే మహిళలు కూడా వాట్సాప్ వాడాల్సి వస్తున్నది… వారికి ఇంగ్లీషులోని ప్రైవసీ పాలసీపై అవగాహన ఉంటుందా?..” అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. “నేను ఈ మధ్య అనారోగ్యం గురించి ఫ్యామిలీ డాక్టర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాను… ఆయన కొన్ని మందులు వాడమని ప్రిస్క్రిప్షన్‌లో సూచించారు.. కొద్దిసేపటికే మందులకు సంబంధించిన యాడ్ ప్రత్యక్షమైంది… వ్యక్తుల బిహేవియర్‌ను, వారి అలవాట్లను, మానసిక స్థితిని వాట్సాప్ ఎందుకు పరిశీలించాలి?.. వ్యక్తుల అభిరుచిని యాడ్స్ రూపంలో వాట్సాప్ మానిటైజ్ చేసుకుంటున్నది…” అంటూ చీఫ్ జస్టిస్ తీవ్ర స్వరంతో మందలించారు. తీవ్ర స్థాయిలో వాదనల అనంతరం మెటా సంస్థ అఫిడవిట్ వేయడానికి అనుమతించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ సైతం ఇంప్లీడ్ కావాలని సూచించింది.

Read Also: పార్లమెంట్‌లో గందరగోళం.. వెల్‌లోకి దూసుకొచ్చిన సభ్యులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>