కలం, డెస్క్ : రాష్ట్రంలో ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తున్నందున ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ పెట్టే రోజని.. తెలంగాణకు ఎలాంటి నిధులు సాధించే సత్తా సీఎం రేవంత్ రెడ్డికి లేదనే విషయాన్ని డైవర్ట్ చేయడానికే మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణ జరిపిందని తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా కూడా బడ్జెట్ లో తెలంగాణకు నిధులు సున్నా అని వ్యాఖ్యానించారు కేటీఆర్. వాస్తవానికి కేసీఆర్ ను ఎర్రవెల్లిలోనే విచారించాల్సి ఉన్నా కూడా.. చట్టాలను గౌరవించే వ్యక్తిగా కేసీఆర్ నందినగర్ కు వచ్చి సిట్ కు సహకరించారని తెలిపారు కేటీఆర్.
అసలు ఫోన్ ట్యాపింగ్ లో ఎలాంటి తప్పులు జరగలేదని సిట్ అధికారులకు తెలుసని కేటీఆర్ (KTR) వెల్లడించారు. ఎన్నో ఫేక్ ప్రచారాలను రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని.. వాటిని ఆపేయాలన్నారు కేటీఆర్. సిట్ విచారణ ఉన్న ప్రతిసారి లీకులు ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
కేంద్ర ప్రభుత్వం ఎంగిలి మెతుకులు కూడా తెలంగాణకు ఇవ్వకపోతే బాధ్యతగా వ్యవహరించాల్సిన సీఎం రేవంత్ టూర్ లో ఉండటం విడ్డూరం అన్నారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుంటే.. బీఆర్ ఎస్ పోరాటాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి విచారణలు పెడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని.. ఎన్ని దాడులు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరన్నారు కేటీఆర్. ఎక్సైజ్ కానిస్టేబుల్ చంపేసినా, కోఠిలో కాల్పులు జరిపి దోచుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ కుంభమేళా అయిన మేడారంలో దారుణమైన ఏర్పాట్లు చేస్తే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ ప్రస్తుతం విదేశాల టూర్ లో ఉన్నాడు కాబట్టి.. ఇక్కడ తెలంగాణలో తమను ఇబ్బంది పెట్టాలని చెప్పినట్టు కనిపిస్తోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


