కలం, నిజామాబాద్ బ్యూరో: ‘సర్’ (SIR) ప్రక్రియ నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో జాప్యం అవుతుంది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడంలేదు. సర్వేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం వరకు సాఫీగా సాగుతున్న సర్వే మధ్యాహ్నం తర్వాత మందకొడిగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లకు ఇప్పటి వరకు 50 శాతానికి పైగా ఎన్యుమరేషన్ ఫారాలు అందగా.. పట్టణ ప్రాంతాల్లో 30 శాతమే అందాయి. ముఖ్యంగా అద్దెకు ఉన్న ఓటర్లు అక్కడ లేకపోవడం.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియక బీఎల్వోలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. కొన్ని ఇళ్లకు తాళాలు.. మరికొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లడం వంటి కారణాలతో ఇంటింటి సర్వే ఒక్క అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది.
ప్రతీ ఒటరు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిచేసి బీఎల్వోలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఒక్కో బీఎల్వోకు వెయ్యి నుంచి 1,200 ఓటర్ల వరకు ప్రతీ ఇంటికి వెళ్లి ఫారాలను ఇవ్వాల్సి ఉండడంతో ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఎన్యుమరేషన్ పారాలను తీసుకుంటున్న ఓటర్లు వాటిని పూర్తి చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 2002లో ఉన్న ఓటు వివరాలను ఇప్పుడు.. ఎన్యుమరేషన్ ఫారంలో నింపాల్సి ఉండడంతో అప్ప టి ఓటరు జాబితా లేక ఆ వివరాలు లేక ఓటర్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతిని దుల ద్వారా సహకారం అందుతున్నా పట్టణ ప్రాంతంలో మాత్రం బీఎల్ వోలకు అశించిన మేర సహ కారం అందడంలేదు.
సర్ పై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడంలో బీఎల్వోలు ఇబ్బందులు పడుతున్నారు. దొంగ ఓట్లు, రెండుచోట్ల ఉన్న ఓట్లు, మరణించిన వారి ఓట్లను తొలగించేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఎన్యుమరేషన్ పత్రంలో వివరాలను నమోదు చేయాలని అడుగుతుండడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. 2002 లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్ ఓ ల వద్ద 2002కు సంబంధించి ఓటరు జాబితా ఒకటే ఉండగా, పీడీఎఫ్ ద్వారా మొబైల్ ఫోన్లలో జాబితాను చూస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో స్మార్ట్ ఫోన్ లేనివారు, నిరక్షరాస్యులు 2002 ఓటరు జాబితాలో తమ పేరు చూసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన లేక పదే పదే బీఎల్ వోలను ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

