కలం, మెదక్ బ్యూరో: దశాబ్దాలుగా హైదరాబాద్ వాసుల తాగునీటి అవసరాలను తీర్చే సింగూరు ప్రాజెక్టు (Singur Project) ప్రస్తుతం ఇబ్బందుల్లో పడింది. డ్యాంసెఫ్టీ అధికారుల సూచనతో ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. మరమ్మతులు సకాలంలో పూర్తవుతాయా? సకాలంలో తాగునీరు, సాగునీరు అందే అవకాశం ఉందా? అన్న చర్చ సాగుతోంది. సింగూరు ప్రాజెక్టు ద్వారా జంటనగరాలతోపాటూ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ జలాశయాన్ని సంగారెడ్డి జిల్లాలోని మంజీరా నదిపై నిర్మించారు. సింగూరు జలాశయం. మిషన్‌భగీరథ పథకంలో భాగంగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 1800 గ్రామాలకు తాగునీటి అవసరాలు తీరుస్తుంది. అంతేకాదు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో వేల ఎకరాలకు సాగునీటి అవసరాలూ తీరుస్తున్నది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు వద్ద మంజీరా నదిపై ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణం 1976 ప్రారంభమై 1988లో వినియోగంలోకి వచ్చింది. మొత్తం 29.917 టీఎంసీల సామర్థ్యంతో 527 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించారు. జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
40 వేల ఎకరాలకు సాగునీరు
సింగూరు (Singur Project) నుంచి సాగునీరు విడుదల చేయాలన్న స్ధానిక రైతుల డిమాండ్‌తో ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కట్ట మొత్తం మట్టితో నిర్మించడం ప్రత్యేకత. 7 వేల 520 మీటర్ల మేర ఈ కట్ట విస్తరించి ఉంటుంది. రివిట్‌మెంట్ బండరాళ్లతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని సైతం తట్టుకుంది. ఒకేసారి 8 లక్షల 16 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా దీనిని డిజైన్ చేశారు. సింగూరు వినియోగంలోకి వచ్చినప్పటి నుండి 2012 వరకు అంటే 24 సంవత్సరాల పాటు రివిట్‌మెంట్, కట్ట పటిష్ఠంగానే ఉన్నాయి. ఆ తర్వాత 2012లో సరైన మెయింటనెన్స్ లేకపోవడం, మరమ్మతులు చేయకపోవడంతో రివిట్‌మెంట్ దెబ్బతినడం మొదలైంది. రాళ్లు తొలగిపోవడం, కట్ట కుంగిపోవడం అక్కడక్కడ కనిపించింది. కానీ అప్పుడు ఎవరూ దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత 2015- 2016, 2018- 2019 సంవత్సరాల్లో సింగూరు జలశాయం ఎండిపోయింది. ఆ సమయంలో కట్టకు మరమ్మతులు చేసేందుకు మంచి అవకాశం ఉన్నాఎవరూ పట్టించుకోలేదు. ఏండ్లు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత ఎక్కువైంది. దీంతో అప్పటికప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేస్తు వస్తున్నారు.
డ్యాం సేఫ్టీ రిపోర్టుతో కదిలిన ప్రభుత్వం
గత ఏడాది సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన డ్యాం సేఫ్టీ అధికారులు. డ్యాం భద్రతపై పలు సూచనలు చేస్తు రిపోర్టు ఇచ్చారు. ఇందులో ప్రాజెక్టు కట్ట రివిట్‌మెంట్ వేగంగా దెబ్బతింటుందని, కట్ట పునాదికి గ్రౌటింగ్ చేయాలని తేల్చింది. అంతేకాకుండా అనకట్టకు రక్షణగా పిట్ట గోడకు నిలువునా చీలిందని, స్పిల్ వే , ఎర్త్ డ్యాం, గ్యాలరీలకు రిపేర్ చేయాలని సూచించింది. సింగూరు ప్రాజెక్టుకు తక్షణం పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్యాంసేఫ్టీ రివ్యూ ఫ్యానల్ ఇచ్చిన మేరకే నీటిని నిలువ ఉంచారు. అధికారుల సూచనల మేరకు సింగూరుకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టంది ప్రభుత్వం. మరమ్మత్తుల కోసం సింగూరు ప్రాజెక్టు తాగునీటి అవసరాల కోసం 8 టీఎంసీలు మాత్రమే ఉంచి ప్రాజెక్టును పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో సింగూరు ప్రాజెక్టు అయకట్టు ప్రాంతాలైన అందోల్ నియోజకవర్గం. మెదక్ ఘనపురం ప్రాజెక్టు కింది అయకట్టు నీటి లభ్యత లేకపొవడంతో క్రాప్ హలీడేను ప్రకటించారు. ప్రాజెక్టు మరమ్మత్తు పనులకు 61.50 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం డ్యాం సేఫ్టీ అధికారులు సూచించిన విధంగా డ్యాం చుట్టు అరు కిలో మీటర్ల మేర రివిట్‌మెంట్ పనులు చేస్తున్నారు. వచ్చే సీజన్ జూలై నాటికి ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.
తాగునీటి సరఫరా సాఫీగా సాగేనా ?
ప్రసుత్తం సింగూరు ప్రాజెక్టులో 6.76 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని కొంత భాగానికి మంజీరా నీరే ఆధారం. రోజూ 70 ఎంజీడీల నీరు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేయాల్సి ఉంటుంది. జంట నగరవాసులతో పాటు బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకూ నీటిని అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిషన్ భగీరథ స్కిమ్ ద్వారా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 1800 గ్రామాలకు నెలకు 0.45 టీఎంసీల నీరు అవసరమవుతుంది. మిషన్ భగీరథ పథకానికి వేసవిలో 3 టీఎంసీల నీరు సరిపోతుందని. మరో మూడున్నర టీఎంసీల నీరు హెచ్‌ఎండబ్ల్యుఎస్‌కు అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రసుత్తం నిల్వ ఉన్న 6.76 టీఎంసీల నీటితో ఎలాంటి సమస్య లేకుండా జూలై వరకు నిరాటంకంగా తాగునీరు సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. వేసవిలోనే మరమ్మతులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు వేగంగా చేస్తున్నమన్నారు. జూలై నెల నుండి వర్షాకాలంలో ప్రాజెక్టులోకి వచ్చే ఇన్‌ఫ్లోతో తాగునీటి సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. వచ్చే సీజన్ వరకూ పనులు కొనసాగితే మాత్రం తీవ్రస్థాయి ఇబ్బందులు తప్పకపోవచ్చు. హైదరాబాద్‌తో పాటు మూడు జిల్లాల్లో తాగునీటికి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నీటిపారుదల , హెచ్‌ఎండబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు.

