Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ డంప్ యార్డు ఇష్యూ.. రాష్ట్రవ్యాప్తంగా చర్చ

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్  (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ డంప్ యార్డు తరలింపు అంశం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. హుజురాబాద్ సమీపంలోని సిర్సపల్లి (Sirsapalli)  వద్ద డంప్ యార్డు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం స్థానికంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. దీంతో సమస్య కొలిక్కి వస్తుందనుకున్న సమయంలోనే వివాదం మళ్లీ ముదురుతూ బంద్‌లు, ర్యాలీలు, నిరసనలు, దీక్షల రూపంలో ఉద్యమంగా మారింది. ఈ అంశం జిల్లా రాజకీయాలను దాటి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దశాబ్ద కాలంగా బొమ్మకల్ పరిధిలో ఉన్న డంప్ యార్డు కారణంగా చెత్త దహనం, పొగ, దుర్వాసనతో పది డివిజన్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్వాసకోశ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డంప్ యార్డును సిర్సపల్లికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే తాజా నిర్ణయంపై మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. గతంలో అభ్యంతరం చెప్పని పార్టీలు ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. హుజురాబాద్ (Huzurabad) ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.  ఇదే విషయాన్ని మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం  రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కరీంనగర్, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ల డంప్ యార్డు సమస్యను తీరుస్తామని ప్రకటించారు. దీంతో హఠాత్తుగా హుజురాబాద్ లో నిరసనలు మొదలయ్యాయి. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బంద్‌కు పిలుపునివ్వడం, దీక్షలను ప్రోత్సహించడం వంటి వాటితో డంప్ యార్డు తరలింపు ప్రశ్నార్దకంగా మారింది.

సీఎం స్వయంగా ప్రకటించినప్పటికీ అసెంబ్లీ ఇంచార్జి వొడితెల ప్రణవ్ మీడియా సమావేశంలో తామూ వ్యతిరేకిస్తున్నామని చెప్పడం గమనార్హం. అసలు డంప్ యార్డు స్థలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పవర్ ప్లాంట్ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం జరగదని వివరించడానికి బదులు ఏకంగా బీఆర్ఎస్‌తో పాటే తామూ వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడంతో ప్రభుత్వ పెద్దలకు, కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పించడం ద్వారా ప్రజల్లో తమ రాజకీయ పలుకుబడికి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారని తెలుస్తోంది.

బీజేపీ నాయకులు కూడా సిర్సపల్లి స్థలాన్ని పరిశీలించి అక్కడ డంప్ యార్డు అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే తరహా అభ్యంతరం వ్యక్తం చేయడం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది. ప్రస్తుతం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం డైలమాలో పడింది. సమస్యకు పరిష్కారం చూపకుండా కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>