కలం, ఖమ్మం బ్యూరో: నల్లబంగారాన్ని వెలికితీస్తూ దేశానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికుడి ఇంట్లో నేడు పొయ్యి వెలగని పరిస్థితి. సింగరేణి సూపర్ బజార్ యాజమాన్యం నిర్లక్ష్యమో, మధ్యవర్తుల అక్రమార్జనో తెలియదు కానీ సామాన్య కార్మికుడి కుటుంబం మాత్రం గ్యాస్ సిలిండర్ కోసం వీధిన పడాల్సి వస్తోంది. సింగరేణి నిబంధనల ప్రకారం ప్రతి శాశ్వత ఉద్యోగికి సింగరేణి కో-ఆపరేటివ్ కన్స్యూమర్ స్టోర్స్ (సూపర్ బజార్) ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందే సదుపాయం ఉంటుంది. దాదాపు అందరు ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. కనెక్షన్ల సంఖ్య సుమారు 2,500 పైచిలుకు ఉంటుందని అంచనా.
కార్మికులకు అందాల్సిన సిలిండర్లు పక్కదారి
ఏజెన్సీల వారీగా చూస్తే ఈ కనెక్షన్లు ప్రధానంగా రెండు కంపెనీల మధ్య విభజించబడి ఉన్నాయి. హెచ్‌పీ గ్యాస్ పీవీ కాలనీలోని గోడౌన్ ద్వారా పంపిణీ జరుగుతుండగా, భారత్ గ్యాస్ బాంబే కాలనీలోని గోడౌన్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం నియమించిన ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా ఈ సిలిండర్లను కార్మికుల క్వార్టర్లకు డోర్ డెలివరీ చేస్తారు. కొంతకాలంగా మణుగూరు సింగరేణి ఏరియాలో గ్యాస్ డోర్ డెలివరీ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయిందనీ, నిబంధనల ప్రకారం ఇంటికి చేరాల్సిన సిలిండర్లు దొడ్డిదారిన బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. కార్మికులకు అందాల్సిన సిలిండర్లను అక్రమార్కులు పక్కదారి పట్టించి, అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్‌కు రూ.1,020 రూపాయలు వసూలు చేస్తున్నా, కనీసం ఇంటికి తెచ్చి ఇచ్చే నాథుడే కరువయ్యారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ల కోసం పడిగాపులు
మరో వైపు రాత్రంతా భూగర్భ గనుల్లో కఠినమైన ‘నైట్ డ్యూటీలు’ చేసి వచ్చిన కార్మికులు, ఉదయాన్నే విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి.. గ్యాస్ సిలిండర్ కోసం గంటల తరబడి పడికాపులు కాయాల్సిన పరిస్థితి.”ఆన్‌లైన్ పేమెంట్ చేసినా సిలిండర్ ఇవ్వడం లేదు. ఓటీపీలు వచ్చినా అప్‌డేట్ కావడం లేదు. ఫోన్ చేస్తే సమాధానం చెప్పే వారు లేరు. మా కష్టాన్ని చూసే నాథుడే లేరా?” అని కార్మిక కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి.
ఆన్‌లైన్ వ్యవస్థతో చిక్కులు
ఆన్‌లైన్ వ్యవస్థను నమ్ముకున్న వినియోగదారులకు కూడా చుక్కెదురవుతోంది. పేమెంట్ పూర్తయినా, ఓటిపిలు జనరేట్ అయినా.. సర్వర్ లోపాల సాకుతో డెలివరీని నిలిపివేయడం వెనుక పెద్ద కుంభకోణమే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డోర్ డెలివరీ నిలిచిపోవడంతో మహిళలు, వృద్ధులు సిలిండర్లను మోసుకెళ్లలేక నానా యాతన పడుతున్నారు. ఈ గందరగోళానికి ముగింపు పలకాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉంది. వెంటనే గ్యాస్ డోర్ డెలివరీని పునరుద్ధరించాలి. బ్లాక్ మార్కెట్‌కు సిలిండర్లను తరలిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆన్‌లైన్ పేమెంట్, ఓటిపి సమస్యలను తక్షణమే పరిష్కరించి కార్మికులకు ఊరటనివ్వాలి.కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి సంస్థను లాభాల్లో నడిపిస్తుంటే, వారికి కనీస అవసరమైన గ్యాస్ సరఫరాలో ఇలాంటి ఇబ్బందులు కలగడం యాజమాన్య వైఫల్యమే అని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
బ్లాక్‌లో అమ్మకాలు
గ్యాస్ సరఫరా చేసే డోర్ డెలివరీ బాయ్స్, ఇతర సిబ్బంది కలిసి, మేము బుక్ చేసుకున్న సిలిండర్లను ఇతరులకు బ్లాక్ లో అమ్ముకున్నారు. దీంతో మాకు గ్యాస్ దొరకడం లేదు. అడిగితే మీకు ఓటీపీ రావడం లేదని చెప్తున్నారు. మరో పక్క రూ.950 ఉన్న సిలిండర్ ను రూ.1020 కి అమ్ముతున్నారు. కాబట్టి సింగరేణి యాజమాన్యం కలుగ చేసుకుని, తక్షణమే గ్యాస్ కొరతకు పరిష్కారం చూపి, డోర్ డెలివరీనీ అందుబాటులోకి తీసుకురావాలి.
– ఆవుల నాగరాజు, సింగరేణి కార్మికుడు, మణుగూరు

