కలం, వెబ్‌డెస్క్: దేశంలో రాబోయే ప్రకృతి విపత్తులు, వరదలు, ఎండల తీవ్రతను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల సన్నద్ధత, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సమీక్షించారు. ప్రాణనష్టం జరగకుండా ఆస్తి నష్టాన్ని తగ్గించేలా వ్యూహాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వరద అంచనా వేసే వ్యవస్థలను బలోపేతం చేయడం, ఎండలు, వరదలు ఒకేసారి తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటంపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే సమాజంలో అవగాహన పెంచడం, అవసరమైన సహాయక సామాగ్రి, వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవడంపై హోం మంత్రి దృష్టి సారించారు. విపత్తులను తట్టుకోగల భారత్‌ను నిర్మించే దిశగా మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

