కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో (Paddy Procurement) రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా.. రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదని మండిపడ్డారు. మెదక్ జిల్లాలోని చేగుంట మండలం కర్ణాల్‌పల్లి కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ రావు సందర్శించిమాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని అన్నారు. కర్ణాల్‌పల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులైందని.. ఇప్పటివరకు కేవలం రెండే లారీలు వచ్చాయని చెప్పారు.పది రోజులకు ఒక లారీ వస్తే ఈ వడ్లన్నీ ఎప్పుడు కొనాలి? అని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వర్షాలకు వడ్లు తడిసి, మళ్లీ ఆరబెట్టినా కొనలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.
ఒక్క రోజైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారా?
రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఇంతవరకు వడ్ల కొనుగోళ్లపై ఒక్క రోజైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారా? మీ మంత్రులతో ఒక్క మీటింగ్ అయినా చేశారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మీకు ఢిల్లీకి పోవడం, హైదరాబాద్ కు రావడం తప్ప వేరే పనే లేదా? ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టడం తప్ప.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కష్టాలు ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టవా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోళ్లపై సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. ఏసీ రూముల్లో కూర్చుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన ఒకసారి పోలీసులను పక్కనపెట్టి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల కన్నీళ్లు, కష్టాలు ఏంటో అర్థమవుతాయని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సర్పంచులే నేడు వడ్లు కొనాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారని అన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా తయారైందో ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు..
రాష్ట్రంలో మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదని హరిశ్ రావు దుయ్యబట్టారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభమే కాలేదన్నారు. 35 రోజుల నుంచి సన్ ఫ్లవర్ కొనుగోళ్లు ఆగిపోయాయని.. కుప్పల కింద ఆ పంటకు చెదలు పడుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి వల్లే నేడు అది దివాలా తీసిందన్నారు. ఆ సంస్థ NPA కావడంతో బ్యాంకులు అప్పులివ్వడం లేదని చెప్పారు. దాంతో దొడ్డిదారిన కోఆపరేటివ్ బ్యాంకు నుంచి మార్క్ ఫెడ్ కు, అక్కడి నుంచి సివిల్ సప్లైస్ కు డబ్బులు మళ్లించారని ఆరోపించారు. మీ అవినీతి, తప్పులకు రైతులను బలిచేస్తున్నారని అన్నారు. రేషన్ షాపుల్లో ఏళ్ల తరబడి నిల్వ ఉన్న సుమారు రూ. 500 కోట్ల విలువైన దొడ్డు బియ్యం పురుగులు పట్టి ముక్కిపోయాయని చెప్పారు. వాటిని అమ్మి రికవరీ చేయాలన్న కనీస సోయి, బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ముఖ్యంగా చేగుంట మండలంలోని 10 గ్రామాల్లో వడగండ్ల వాన వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వరుసగా మూడు యాసంగి సీజన్లలో రైతులు నష్టపోతూనే ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని లారీలు పంపించి, కాంటాలు పెట్టి వడ్లు కొనాలన్నారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులం అంతా కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

