కలం, వెబ్ డెస్క్ : సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ కారణాల వల్ల కొంతకాలంగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డు (Singareni Medical Board)ను అతి త్వరలోనే పునఃప్రారంభించాల్సిందిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) యాజమాన్యాన్ని ఆదేశించారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ అంశం తన దృష్టికి వచ్చిందని, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా కేవలం నిజమైన అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు, మధ్యవర్తుల మోసాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి సూచించారు. ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో కార్మికులు యాజమాన్యానికి సహకరించాలని కోరారు. ఇందులో భాగంగానే, కారుణ్య నియామకాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు శనివారం (ఈ నెల 13వ తేదీన) మంచిర్యాలలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో స్వయంగా నియామక పత్రాలను అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే దశాబ్దాలుగా నలుగుతున్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి న్యాయ సలహాలు తీసుకుంటున్నామని, నిబంధనల ప్రకారం సానుకూల నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పటివరకు మొత్తం 2,657 పోస్టులను భర్తీ చేయగా, అందులో 2,102 కారుణ్య నియామకాలే ఉన్నాయని చెప్పారు. గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుండి 40 ఏళ్లకు పెంచడం వల్ల అదనంగా 200 మంది లబ్ధి పొందారన్నారు. దేశంలోనే తొలిసారిగా కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఉచిత సహజ బీమా, కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని వివరించారు. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో రూ.1500 కోట్ల లాభాల వాటాను పంచడమే కాకుండా, కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణతో పాటు గోదావరిఖనిలో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేశామని, వైద్య సేవల కోసం ఏటా రూ.300 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్త బొగ్గు బ్లాకుల సాధన ద్వారా సింగరేణిని ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తామని, అయితే పోటీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు కార్మికులంతా ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

