Mobile Popup Ad
Mobile Popup Ad

డిజిటల్ చెరలో బాల్యం.. మార్పు మన నుండే మొదలవ్వాలి!

కలం, వెబ్‌డెస్క్: ఒకప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలు వీధుల్లో, మైదానాల్లో సందడిగా ఆడుకునేవారు. ఎండను సైతం లెక్కచేయకుండా పిల్లలందరూ కలిసి క్రికెట్, కబడ్డీ, దాగుడు మూతలు, గోళీలు ఆడేవారు. కానీ ఈ రోజుల్లో సెలవులు వస్తే వీధులు నిశ్శబ్దంగా మారుతున్నాయి. పిల్లలు ఏసీ గదుల్లో కూర్చుని ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. టీవీలకు అతుక్కుపోతున్నారు. పక్కన ఉన్న స్నేహితుడితో మాట్లాడటం మానేసీ పబ్‌జీ, ఫ్రీఫైర్ వంటి గేమ్స్‌కు పరిమితం అవుతున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే వారు డిజిటల్ రోబోలుగా మారిపోతున్నారు. దీనివల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల పెంపకం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో (Parenting Tips) నిపుణులు సూచిస్తున్నారు.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పిల్లలను స్కూల్లో జాయిన్ చేసి అంతా టీచర్లే చూసుకుంటారని తల్లిదండ్రులు చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు టీవీలు, ఫోన్లు పక్కన పెట్టి పిల్లలతో సమయం గడపడం చాలా ముఖ్యం.
  • సెలవు రోజుల్లో వాళ్లను సినిమా హాళ్లకు, మాల్స్‌కు తీసుకెళ్లడానికి బదులు పార్కులు, మ్యూజియం వంటి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు తీసుకువెళ్లాలి. పార్కులలో చెట్లు, పచ్చని గడ్డిపై నడవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • మ్యూజియంలు, సైన్స్ సెంటర్లకు తీసుకెళ్లడం వల్ల చరిత్ర, సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రశ్నలు అడిగే తత్వం అలవడుతుంది.
  • తల్లిదండ్రులు ఫోన్ చూస్తూ పిల్లలను చదువుకోమని చెబితే వారు అస్సలు వినరు. అందుకే తల్లిదండ్రులు కూడా ఫోన్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
  • పిల్లలను కేవలం మార్కులకే పరిమితం చేయకుండా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత అని చెబుతున్నారు.
  • పిల్లల మేలు కోరే తల్లిదండ్రులు వారి చేతికి స్మార్ట్ ఫోన్‌కు బదులు బంతిని అందించాలని సూచిస్తున్నారు.

ఆన్‌లైన్ గేమింగ్ వలన కలిగే నష్టాలు

  • పిల్లలు రోజంతా స్క్రీన్ చూడటం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక వికాసం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
  • శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం, కంటి సమస్యలు, వెన్ను నొప్పి వస్తాయట.
  • పబ్‌జీ, ఫ్రీఫైర్ వంటి హింసాత్మక గేమ్స్ ఆడటం వలన కోపం, మొండితనం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
  • పిల్లలు అస్తమానం స్క్రీన్ చూడటం వలన స్క్రీన్ పై కనిపించే సమాచారాన్ని మాత్రమే గ్రహించే రోబోల్లా తయారవుతారట. సొంతంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి డిజిటల్ చెర నుంచి పిల్లలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>