Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణిలో గెలిస్తే సింగిడి (తెలంగాణ) గెలిచినట్లేనా!

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాజకీయ యవనికపై అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతటి ప్రాధాన్యత, ఉత్కంఠను రేకెత్తించే ఏకైక సమరంగా భావించే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. బొగ్గు గనుల సాక్షిగా సాగే ఈ ‘నల్లబంగారు పోరు’ కేవలం కార్మిక సమస్యల చుట్టూనే కాకుండా, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల భవిష్యత్తును కూడా శాసించే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న గుర్తింపు సంఘాల గడువు సెప్టెంబర్ 2026 వరకు పొడిగించబడినప్పటికీ, కోల్ బెల్ట్ (బొగ్గు గనుల ప్రాంతం) లో అప్పుడే ప్రచార పర్వం రసవత్తరంగా మారింది. ఇందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సింగరేణి బాయి బాట కార్యక్రమాన్ని, బీజేపీ వాళ్ళు సింగరేణి బరోసా యాత్ర ను చేపట్టడం జరిగింది.

మినీ జనరల్ ఎలక్షన్!

సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 మైనింగ్ డివిజన్లలో జరగబోయే ఈ ఎన్నికలను తెలంగాణ రాజకీయాల్లో ఒక “మినీ జనరల్ ఎలక్షన్” గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. భౌగోళికంగా ఈ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలోని 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 లోక్‌సభ స్థానాల పరిధిపై స్పష్టంగా కనిపిస్తుంది. యాంత్రీకరణ, రిటైర్మెంట్ల కారణంగా సింగరేణిలో నేరుగా ఓటు హక్కు ఉన్న పర్మనెంట్ కార్మికుల సంఖ్య దాదాపు 40,000 కు తగ్గినప్పటికీ, వారి కుటుంబ సభ్యులు, దాదాపు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానిక వ్యాపార వర్గాలను కలుపుకుంటే దాదాపు 4 నుండి 5 లక్షల మంది ఓటర్లు ప్రత్యక్షంగా సింగరేణి నిర్ణయాల చేత ప్రభావితమవుతారు. అందుకే రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం వంటి కీలక స్థానాల్లో కేవలం ‘సింగరేణి సెంటిమెంట్’, ‘కార్మిక సమస్యల’ ఆధారంగానే సాధారణ ఎన్నికల్లో కూడా గెలుపోటములు ముడిపడి ఉంటాయి.

సింగరేణి ఎన్నికల్లో అనూహ్య మార్పులు

​తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు (2012, 2017) బిఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇక్కడ ఏకఛత్రాధిపత్యం నడిపింది. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి తర్వాత జరిగిన సింగరేణి ఎన్నికల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఎన్నికల్లో సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ అత్యధిక ఓట్లతో గెలిచి ‘గుర్తింపు సంఘం’ హోదాను దక్కించుకోగా, కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ ఆరు డివిజన్లలో గెలిచి గట్టి పోటీ ఇచ్చింది.

స్వయంగా రంగంలోకి భట్టి

ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాబోయే సెప్టెంబర్ 2026 పోరు కోసం కొత్త పొత్తులు, పాత శత్రుత్వాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ​ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా సింగరేణిపై పూర్తి పట్టు సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా రంగంలోకి దిగి, కార్మికులకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం, మెడికల్ బోర్డుల పునరుద్ధరణ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హామీలతో క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు.

ఈసారి సరికొత్త ట్విస్ట్‌

మరోవైపు, గతంలో ఇక్కడ చక్రం తిప్పిన బీఆర్ఎస్ ఈసారి సరికొత్త ట్విస్ట్‌తో రంగంలోకి దిగింది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈసారి బిఆర్ఎస్ అనుబంధ సంఘం కంటే ఎక్కువగా హింద్ మజ్దూర్ సభ’ తో కలిసి ప్రచార రంగంలోకి దిగడం కార్మికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె సింగరేణి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, తన పాత క్యాడర్‌ను రీ-యాక్టివేట్ చేసే పనిలో పడ్డారు. ఇక కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ కూడా ఇక్కడి అక్రమాలపై విచారణ జరిపిస్తామని కార్మికులను ఆకర్షిస్తుంటే, ప్రస్తుత గుర్తింపు సంఘం హోదాలో ఉన్న సిపిఐ ఏఐటీయూసీ తమ పాత క్యాడర్ సాయంతో పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.

ప్రతిపక్షాల ప్రధాన అస్త్రాలుగా కీలక అంశాలు..

​ఈసారి ఎన్నికల అజెండాను కేవలం కార్మిక వేతనాలు మాత్రమే కాకుండా కొన్ని తీవ్రమైన ఆరోపణలు శాసిస్తున్నాయి. దాదాపు రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు నిల్వల మాయంపై వస్తున్న ఆరోపణలు, టెండర్లలో అవకతవకలు, సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలు, డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. అధికార పక్షాలు తమ సంక్షేమ పథకాలను నమ్ముకుంటే, ప్రతిపక్షాలు యాజమాన్య వైఫల్యాలను ఎండగడుతున్నాయి. “సింగరేణి గెలిస్తే.. సింగిడి (తెలంగాణ) గెలిచినట్లే” అనే నానుడి నిజం చేస్తూ, రాబోయే సింగరేణి ఎన్నికలు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు 2028 అసెంబ్లీ సమరానికి ఒక సెమీఫైనల్ లాంటివని చెప్పవచ్చు. బొగ్గు బావుల సాక్షిగా సాగుతున్న ఈ హోరాహోరీ పోరులో నల్లబంగారు కార్మికులు ఈసారి ఎటు వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>