బొగ్గు గనుల్లో ముసురుకున్న నల్లమబ్బులు

కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి (Singareni) బొగ్గు గనుల్లో రోజువారీ జీవితం అంటేనే ప్రమాదాల అంచున సాగే పోరాటం. నేల గర్భంలోకి దిగి, రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు పంచే కార్మికుడికి అండగా ఉండేది ఒక్కటే నమ్మకం… ‘తనకు ఏమైనా జరిగితే తన కుటుంబాన్ని ఈ సంస్థ ఆదుకుంటుంది’ అని. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పైనే నల్లమబ్బులు కమ్ముకున్నాయి. ​సంవత్సరాలుగా నమ్ముకున్న కారుణ్య నియామకాల (మెడికల్ ఇన్వాలిడేషన్) విధానం ఇప్పుడు తీవ్ర విమర్శలకు నిలయంగా మారింది.

గనుల్లో పనిచేస్తూ తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నవారు, కిడ్నీలు క్షీణించినవారు, చూపు మందగించినవారు కూడా “మేము అనారోగ్యంతో ఉన్నాం, పనిచేయలేం” అని వేడుకుంటున్నా యాజమాన్యం వినడం లేదు. పోయిన నెల 17,18 తేదీలలో జరిగిన మెడికల్ బోర్డు పరీక్షల్లో జాబ్ చేయలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్న కార్మికులను సైతం పూర్తి ఆరోగ్యవంతులు’ (Fit) అని తేల్చి, తిరిగి పాత విధుల్లోకే చేరాలని ఆదేశించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

​సింగరేణిలో కారుణ్య (మెడికల్ ఇన్వాలిడేషన్) నియామకాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. 1998 వరకు నిరంతరాయంగా సాగిన ఈ విధానం, నాటి ప్రభుత్వాల నిర్ణయాలతో ఆగిపోయింది. ఆ తర్వాత సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం ఈ వ్యవస్థను పునరుద్ధరించింది. కరోనా వంటి కష్టకాలంలో 13,119 మందికి ఉద్యోగాలు ఇచ్చి వేలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఈ వ్యవస్థ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దారి తప్పిందని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పక్కనబెట్టి, ప్రతినెలా జరగాల్సిన మెడికల్ బోర్డుల నిర్వహణను మందగించేలా చేశారని ఆరోపిస్తున్నారు.

​గతంలో ప్రతినెలా 3 నుండి 4 సార్లు క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు నిర్వహించేవారు. కానీ గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ పూర్తిగా మందగించింది. దాదాపు 2,500 మంది దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తుంటే, కేవలం 124 మందికి మాత్రమే మెడికల్ బోర్డు నుంచి సమాచారం ఇచ్చారు. అందులోనూ కేవలం 24 మందికే ఆఫర్ లెటర్లు ఇచ్చి, మిగతా 100 మందిని ‘అన్ ఫిట్’ అని తేల్చి బలవంతంగా తిరస్కరించడం వెనుక ఉన్న అంతర్యమేమిటని యూనియన్ల నేతలు ప్రశ్నిస్తున్నారు.

​ఈ పరిస్థితిపై సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టిబిజికెఎస్ (TBGKS), ఏఐటీయూసీ (AITUC) వంటి ప్రధాన కార్మిక సంఘాలు యాజమాన్యం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాయి. బూటకపు మెడికల్ బోర్డును రద్దు చేసి, అర్హులైన ప్రతి డిపెండెంట్‌కు ఉద్యోగం కల్పించాలని, కాలం చెల్లిన నిబంధనలను పక్కనబెట్టి పారదర్శకమైన రీ-మెడికల్ బోర్డును నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే సింగరేణి వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తుండటంతో, ఆగస్ట్ 26,27 తేదీలలో జరగబోయే మెడికల్ బోర్డు పరీక్షతో పాటు, భవిష్యత్తు కారుణ్య నియామకాల అంశం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>