కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ యాదవ్ (BP Mandal Yadav) జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు లభిస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం బీపీ మండల్ అని అన్నారు. బహుజన సిద్ధాంతకర్త కాన్షీరామ్ మండల్ కమిషన్ అమలు కోసం దేశవ్యాప్తంగా బీసీల్లో చైతన్యం తీసుకువచ్చి, అప్పటి జనతా పార్టీ ప్రభుత్వంపై పెద్ద ఉద్యమం చేపట్టారని తెలిపారు.
ఆ పోరాటాల ఫలితంగానే మండల్ కమిషన్ అమలై బీసీలకు సమాజంలో తగిన స్థానం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు రామగిరి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు అడ్వకేట్ గొడుగు గంగాధర్, సుంకరి పోతన్న, ఎంజేఎస్ నాయకులు రాజన్న, చిట్టి సాయన్న, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

