కలం, కరీంనగర్ బ్యూరో: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 27న తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ (Telangana Employees JAC) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మహాధర్నాకు సంబంధించిన అధికారిక నోటీసును మంగళవారం ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్, టీజీఓల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఐఏఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం, ఐపీఎస్ లకు అందజేశారు.
ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యం (డీఏ)లను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత వైద్యం అందించే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులు, పదవీ విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. సొంత డబ్బుల కోసం ఉద్యోగులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం దయనీయమని, తమ సహనాన్ని చేతగానితనంగా చూడవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.
వాహనానికి ఇంధనం ఎంత అవసరమో, ప్రభుత్వానికి ఉద్యోగులు అంత ముఖ్యమని, ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరారు. ఆగస్టు 27న జరిగే ఈ మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, IV తరగతి సిబ్బంది, డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘేం లక్ష్మణరావు, అడ్ల అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, ఉస్మాన్ పాషా, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ అరవింద సింగ్, గూడ ప్రభాకర్ రెడ్డి, శారద సునీత, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడు కోట రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

