కలం, ఖమ్మం బ్యూరో: రాజధాని హైదరాబాద్ స్థాయి ఉన్నతమైన, మెరుగైన వైద్య సేవలను ఇకపై ఖమ్మం (Khammam) జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనే స్థానిక ప్రజలకు అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో రూ. 23.75 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 50 పడకల ‘క్రిటికల్ కేర్ యూనిట్’ (CCU) భవనాన్ని మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజాహితం కోసం విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తు తరాలకు అందించే గొప్ప పెట్టుబడి అని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రి వైద్య సేవల్లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఖమ్మంలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తయ్యే నాటికి మరో 200 పడకల ఆసుపత్రి భవనం అత్యవసరమని, దీనికి కావలసిన అనువైన స్థలాన్ని పరిశీలించి ప్రతిపాదనలు పంపితే ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఆసుపత్రిలోని పాత భవనం శిథిలావస్థకు చేరినందున దాని తొలగింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ ఖాళీ స్థలాన్ని రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తామని, విద్యుత్ ఖర్చులను ఆదా చేసేందుకు భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చదువుకున్న ప్రతీ బిడ్డ ఈ దేశానికి ఆస్తి అని, వారి విద్య, ఆరోగ్యంపై పెట్టుబడి పెడితే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

