‘తల్లికి విడాకులిస్తేనే కూతురివి’.. తండ్రి ప్రేమ కోసం ఆడబిడ్డ ఆవేదన!

కలం, ఖమ్మం బ్యూరో: “తల్లికి విడాకులు ఇస్తేనే నిన్ను కూతురిగా అంగీకరిస్తా..” అంటూ సొంత తండ్రే షరతు విధించడంతో, ఆ ప్రేమకు నొచ్చుకున్న ఒక ఆడబిడ్డ న్యాయం కోసం నిరసన బాట పట్టింది. శ్రీరాముడు నడయాడిన పవిత్ర భద్రాద్రి నేలపై, తండ్రి ఆప్యాయత, కనీస ప్రేమ కోసం ఓ కూతురు మంగళవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని, ఆవేదనను రేకెత్తిస్తోంది.

దీక్షకు దిగిన బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం (Bhadrachalam) పట్టణానికి చెందిన తల్లిదండ్రులు విజయ లక్ష్మీ, కోటయ్య ల మధ్య కొంతకాలంగా నడుస్తున్న వివాదాల కారణంగా తనను తండ్రి పూర్తిగా దూరం పెట్టారని కూతురు వెన్నెల ఆరోపించింది. తన తల్లితో సంబంధాలు కొనసాగిస్తున్నాననే ఒకే ఒక్క కారణంతో తనను దగ్గరకు రానివ్వడం లేదని, తండ్రి ఆప్యాయతకు దూరమై మనోవేదనకు గురవుతున్నానని కన్నీటిపర్యంతమైంది.

తన తల్లి దాంపత్య జీవితంలోనూ భర్త (తన తండ్రి) వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని బాధితురాలు పేర్కొంది. తల్లిని మానసికంగా వేధించడమే కాకుండా, కుట్రపూరితంగా ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో కూడా చేర్పించారని ఆరోపించింది. అయితే, తన తల్లి పూర్తి మానసిక స్థిరత్వంతో ఉన్నట్లు నిరూపించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిందని స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా తన తల్లిని భర్త ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, బంధువులకు కూడా దూరం చేశారని వాపోయింది.

ఈ సమస్య పరిష్కారం కోసం పలువురిని ఆశ్రయించినప్పటికీ, అవతలి వైపు ప్రభావశీల వ్యక్తుల అండదండలు ఉండటంతో తమకు ఎక్కడా న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు, పెద్దల నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే వేరే దారి లేక ఆమరణ నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందని వివరించింది.

రాముడి నేలపై తండ్రి ప్రేమ కోసం ఒక కూతురు ఇలా రోడ్డున పడి దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి రావడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ కుటుంబ వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఇరువర్గాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>