కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో సెమికండక్టర్ పరిశ్రమ (Semiconductor industry) అభివృద్ధికి మరో ముందడుగు పడింది. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎనర్జీ మార్కెట్ డివిజన్ పర్మనెంట్ సెక్రటరీ అగస్టీన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిసింది. అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలు, సెమికండక్టర్ రంగం అభివృద్ధిపై చర్చ జరిగినట్లు సమాచారం.
సెమికండక్టర్ తయారీకి సింగపూర్ ఆసక్తి
తెలంగాణలో సెమికండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సింగపూర్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి (CM Revanth Reddy) వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కీలకంగా మారుతున్న సెమికండక్టర్ తయారీ రంగంలో తెలంగాణను భాగస్వామిగా చేసుకునే అవకాశాలపై ప్రతినిధులు ఆసక్తి చూపారు. రాష్ట్రంలో తయారీ కేంద్రాల ఏర్పాటుకు సింగపూర్‌కు చెందిన పలు సంస్థలు ముందుకు రావడం పెట్టుబడుల పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పెట్టుబడులకు పూర్తి సహకారం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్న సింగపూర్ కంపెనీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వాగతించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సెమికండక్టర్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు రావడం ద్వారా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు కొత్త ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. సింగపూర్ సంస్థలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ భేటీ కీలకంగా మారింది.

